మామిళ్లగూడెం, జూలై 27 : ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ శపథాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అనువైన చోటల్లా వాటిని అమలుచేస్తూ వస్తున్నారు. అనువుగాని చోట అబద్ధపు ప్రచారాలతోనూ ధ్వంస రచన చేస్తున్నారు. తన మంత్రివర్గ సహచరులను, తన పార్టీ నేతలను పురిగొల్పి వీలైన చోటల్లా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం మున్నేటిపై గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాంపైనా కన్నేశారు.
ఖమ్మం నగర ప్రజల తాగునీటి అవసరాలు, సమీప రైతుల సాగునీటి అవసరాలు, స్థానికంగా భూగర్భజలాల పెంపు కోసం ఖమ్మం నుంచి ప్రాతినిథ్యం వహించిన అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఖమ్మం మున్నేటిపై ప్రకాశ్‌నగర్ వద్ద రూ.7.45 కోట్ల నిధులతో చెక్‌డ్యాం నిర్మించారు. ఆయన కృషి, కేసీఆర్ చలువ కారణంగా ఈ ప్రాంతంలో తాగు, సాగునీటి కష్టాలు తొలగిపోయాయి. అదే సమయంలో సదరు చెక్‌డ్యాం వేసవిలోనూ జలకళను సంతరించుకుంటోంది. అలా కళకళలాడే జలాలను చూసి ఓర్వలేని కాంగ్రెస్ పాలకులు.. యంత్రాంగంతో తప్పుడు నివేదికలు తయారుచేయించి ఆ చెక్‌డ్యాం కూల్చివేశారు. దీంతో నగరంలో తాగునీటి కటకటకు, పరిసర గ్రామాల్లో సాగునీటి కటకటకు కారణమయ్యారు. చివరికి, మత్స్యకారుల ఉపాధినీ దెబ్బతీశారు.
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలను ఖమ్మం జిల్లాలో ఇక్కడి మంత్రులు ఆచరణలో పెడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో ఇక్కడి మంత్రి ధ్వంస రచనకు కార్యరూపం ఇస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం చేపట్టిన నిర్మాణాల కూల్చివేతలకు కార్యాచరణ చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం మున్నేటిపై గత ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంపై కన్నువేశారు.
అయితే, నగర ప్రజల దాహార్తి తీర్చాలన్న సంకల్పంతో, సమీప రైతులకు సాగునీరు అందించాలన్న ఆశయంతో, భూగర్భజలాల పెంపునకు ఊతమివ్వాలన్న ఉద్దేశంతో ఖమ్మం మున్నేటిపై ప్రకాశ్‌నగర్ వద్ద అప్పటి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో గత కేసీఆర్ ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మించింది. రూ.7.45 కోట్ల నిధులతో చేపట్టిన దీని నిర్మాణానికి 2021 ఫిబ్రవరి 11న అప్పటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. శరవేగంగా నిర్మాణం పూర్తిచేసి అదే ఏడాది జూన్ 17న చెక్‌డ్యాంను ప్రారంభించారు.
బహుళ ప్రయోజనాల కోసం ప్రకాశ్‌నగర్ చెక్‌డ్యాం నిర్మాణానికి సంబంధిత అధికారులు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు కలిసి సర్వే చేసి డీపీఆర్‌లు రూపొందించారు. వాటి ఆధారంగానే గత ప్రభుత్వం అక్కడ చెక్‌డ్యాం నిర్మించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూల్చివేతల పన్నాగం మొదలైంది. చివరికి, అదే అధికార యంత్రాంగంతో తప్పుడు నివేదికలు తయారు చేయించింది. వరద ముప్పు అంటూ సాకు చూపి విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. సుమారు 200 మీటర్ల వెడల్పుతో 3 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ డ్యాంను 2023 నాటి వరదలను బూచిగా చూపి ఆగమేఘాల మీద నిట్టనిలువునా కూల్చివేసింది.
అయితే, 80 ఏళ్లలో మున్నేరులో ఎన్నడూ రానంత వరదలు 2021లో వచ్చాయి. ఆ వరదల ధాటికి ఎగువన ములకలపల్లి వంతెన కొట్టుకుపోయింది. ఖమ్మం నగరం సహా ఖమ్మం రూరల్ మండలంలోని మున్నేరు పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రకాశ్‌నగర్ వద్ద 46 అడుగుల ఎత్తులో నిర్మించిన హైలెవల్ వంతెన కూడా వరదకు కొంత పక్కకు జరిగింది. అయితే, నిత్యం జలకళతో కళకళలాడే మున్నేటి చెక్‌డ్యాం.. కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా కన్పించడంతో కూల్చివేశారు. దీంతో ప్రస్తుతం నగర ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అయితే, ప్రభుత్వ తీరుపై నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2023 నాటి కంటే ముందు వచ్చిన వరదలతో ఖమ్మం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లోని మున్నేటి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం.. సుమారు రూ.525 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా 17 కిలో మీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దానవాయిగూడెం నాగార్జునసాగర్ కాలువ వద్ద నుంచి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జీ దాటు వరకు 60 అడుగుల ఎత్తులో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆ పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వరద వచ్చినా ఈ వాల్ నుంచి నగరానికి రక్షణ ఉంటుంది. అయినప్పటికీ, సహించని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ డ్యాం వల్లనే నగరంలోకి మున్నేటి వరద వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఆ డ్యాంను నేలమట్టం చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జలకళతో నిండిన ప్రకాశ్‌నగర్ మున్నేటి చెక్‌డ్యాం.. నేడు కూల్చివేతతో నీళ్లులేక వెలవెలబోతోంది. చెక్ డ్యాం నిర్మించిన తరువాత అక్కడ మత్స్య సంపద పెరగడంతో స్థానికంగా మత్య్సకారులు ఉపాధి పొందేవారు. ఇప్పుడు వారు ఉపాధి కోల్పోయారు. ఇక, ప్రస్తుత ఎల్ నినో కరువు ఛాయాల నేపథ్యంలో సమీప ప్రాంతాల్లో భూగర్భజలాలు కూడా అడుగంటాయి. నగర ప్రజలకు తాగునీటి కష్టాలూ తప్పేలా లేవు.