పర్ణశాల, నవంబర్ 16: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్’ సమస్య శాపంగా మారింది. ఎంతో ఆశతో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురుకావడంతో ఆందోళన చెందుతున్నారు. పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేసుకొని రెండునెలలు కావొస్తున్నా నేటివరకు బిల్లులు రాలేదు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారానైనా సమస్యను పరిష్కరించి బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. మొదటిదశ బిల్లులు వస్తేనే కానీ నిర్మాణ పనులు ముందుకు సాగవు.
దుమ్ముగూడెం మండలంలో మొదటి దశలో 1,076 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటికే కొంతమంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టి మొదటి దశ బిల్లుల కోసం రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలో లొకేషన్ కనెక్టు కాకపోవడంతో సుమారు 28 ఇళ్లు బేస్మెంట్ వద్దే నిర్మాణాలు ఆగిపోయాయి. నల్లబెల్లి పంచాయతీ మంగవాయిబాడవ గ్రామంలో పాయం మల్లమ్మ ఇంటి లొకేషన్ జెడ్ వీరభద్రాపురం, తుర్రం సుమతి ఇంటి నిర్మాణం లొకేషన్ అశ్వాపురం, వర్సిక సారమ్మ ఇంటి నిర్మాణం లొకేషన్ అంజిపాక గ్రామంగా చూపిస్తున్నాయి. మూడిళ్ల లొకేషన్ కనెక్టు కాకపోవడంతో పునాదుల వరకు నిర్మాణాలు జరిగి ఆగిపోయాయి.
మొదటి విడతలోనే మాకు ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన సంతోషంతో మా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ ఇంటి పనులు ప్రారంభించాము. పంచాయతీ కార్యదర్శి ముగ్గు పోసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మొబైల్లో ఫొటో తీసుకొని అప్లోడ్ చేశారు. పునాదులు తీసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. పునాదులు తీసి బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం పూర్తిచేశాం. మొదటి బిల్లు కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా యాప్లో లొకేషన్ అప్లోడ్ కావడం లేదని చెప్పారు. ఇప్పటికే రెండునెలలు గడిచింది. ఇంకా బిల్లులు రాలేదు.
-పాయం మల్లమ్మ, లబ్ధిదారురాలు