ఖమ్మం జిల్లాలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదరు సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటుచేయని కారణంగా అకాల వర్షాల సమయంలో ధాన్యం నీళ్ల పాలవుతోంది. దీంతో రెక్కలు ముక్కలు చేసుకొని పంటను పండించిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. హడావిడిగా కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం.. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పనను మాత్రం మర్చిపోయింది. దీంతో పంటను కోల్పోతున్న రైతులు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే సమయంలో అరగంట సేపు ఉండే ప్రజాప్రతినిధులు, అధికారుల కోసం టెంటు, చల్లని నీరు, కుర్చీల వంటి వసతులు ఆగమేఘాల మీద ఏర్పాటుచేసే నిర్వాహకులు.. రైతులకు సౌకర్యాలు కల్పించే విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ధాన్యంలో తేమ శాతాన్ని నిర్ధారించే పరికరాలు, ధాన్యంపై కప్పే టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు వంటివి సరిపడినన్ని సమకూర్చిన పాపానపోలేదు. చివరికి రైతులకు, కూలీలకు, హమాలీలను నిలువ నీడ కూడా ఏర్పాటుచేయలేదు. కనీసం తాగునీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు.
-ఖమ్మం, ఏప్రిల్ 21
ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ద్వారా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం.. అదే రైతులకు సదుపాయాలు కల్పించడంలో మాత్రం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ధాన్యం ఆరబోసిన తర్వాత రైతులు కూర్చోవడానికి కనీసం నీడ వసతి కూడా కల్పించలేదు. తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో బయట దుకాణాల వద్ద నీళ్ల బాటిళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం చెల్లించే రూ.500 బోనస్‌ను కాజేసేందుకు దళారులు అనేక ఎత్తులు వేస్తున్నారు. కొందరు వ్యాపారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని క్వింటాకు రూ.100 నుంచి రూ.150 వరకు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇందులో తరుగు పేరిట 5 నుంచి 10 కేజీల వరకూ కోత విధిస్తున్నారు. అదే ధాన్యాన్ని బినామీల పేరుతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి బోనస్‌ను కాజేస్తున్నారు. గత వానకాలం సీజన్లో కూడా ఇదే విధంగా కొందరు దళారులు అక్రమంగా బోనస్‌ను పొందినట్లు సమాచారం. సన్నరకం బియ్యం ధరలు పెరుగుతుండడంతో ఇప్పటికే కొందరు దళారులు రైతుల నుంచి పచ్చి ధాన్యాన్ని క్వింటా రూ.2 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. కానీ ఈ నెల 15న నాటికి 211 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించారు. సోమవారం నాటికి పూర్తిగా ప్రారంభించారు. ఇప్పటి వరకు కేవలం సన్నరకం ధాన్యం13,993 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 4,450 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కాగా, ఈ యాసంగి సీజన్లో 1.89 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకాలు, 70 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
జిల్లాలో గడిచిన వారం రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న అకాల వర్షం వల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోతోంది. ఆరబెట్టిన ధాన్యం తడవకుండా ప్రభుత్వం టార్పాలిన్లను అందుబాటులో ఉంచకపోవడంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. చేతికొచ్చిన ధాన్యం విక్రయించే సమయంలో నీళ్లపాలు కావడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, ముదిగొండ తదితర మండలాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఇటీవలి వర్షాలకు ధాన్యం తడిచిముద్దయిన విషయం విదితమే. ముదిగొండ మండలం గోకినపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడంలేదంటూ చివరికి అన్నదాతలు రహదారిపై ఆందోళన చేయాల్సి వచ్చింది.
అయితే, ఇటీవలి అకాల వర్షాలకు జిల్లాలో తడిచిన ధాన్యాన్ని రైతుల కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం నుంచి అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటివరకూ ఆదేశాలు అందలేదు. దీంతో తడిసిన ధాన్యాన్ని కొనేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. ఇటు తడిసిన వడ్లను నిర్వాహకులు కొనకపోవడంతో, సర్కారు స్పందించకపోవడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.