గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపో యింది. కాంగ్రెస్ పాలనలో పల్లెలు సమస్య లతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారింది. ప్రత్యేక అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. పూర్తిభారం పంచా యతీ కార్యదర్శులపైనే పడింది. ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాకపోవడంతో కార్యదర్శులు సమస్యలను పరిష్కరించలేక పోతున్నారు. ఇంటింటి చెత్త సేకరణ సైతం లేకపోవడంతో పల్లె జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సత్తుపల్లి, జూలై 6 : పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసింది. గ్రామ జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్తోపాటు ట్రక్కు, ట్యాంకర్ను సైతం అందించారు. పచ్చదనం-పరిశుభ్రతకు నిలయంగా గ్రామాలను తీర్చిదిద్దేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెత్త సేకరణ వ్యవస్థ కుప్పకూలింది. గ్రామాల్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీలకు ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. ఇంతకాలం నెట్టుకొచ్చిన కార్యదర్శులు సైతం చేతులెత్తేయడంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గ్రామాల్లో చెత్త సేకరణ కూడా చేయించలేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో 584 పంచాయతీలు ఉండగా అన్నిచోట్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి కిస్తీలు ప్రతినెలా రూ.6 నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉండగా పంచాయతీల్లో నిధులు లేక ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయి. ట్రాక్టర్లు తీసుకొని ఐదేండ్లు కావడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని బాగు చేయించాలంటే రూ.20 వేల రూ.30 వేల వరకు ఖర్చవుతుండడంతో పంచాయతీలకు భారంగా మారింది. కనీసం డీజిల్ కూడా డబ్బులు లేక కొన్ని పంచాయతీల్లో వారానికి, పది రోజులకు చెత్త సేకరిస్తుండగా మరికొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్లను మూలనపెట్టారు.
బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతి ద్వారా 15 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలువల్లో పూడికతీతలు, పిచ్చిమొక్కలు తొలగించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా పల్లెప్రగతిని పట్టించుకోకపోవడంతో పల్లెపాలన అస్తవ్యస్తమైంది. ప్రకృతి వనాలు, హరితహారంలో నాటిన మొక్కలు సైతం నీరు లేక మోడుబారిపోయాయి. వర్షాకాలం వచ్చినప్పటికీ అధికారులు పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడంతో డ్రైనేజీల్లో మురుగునీరు పారుతూ ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలుతాయేమోనని భయపడుతున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, మురుగునీరు రోడ్డుపై ప్రవహిచడం, రోజుల తరబడి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో పందులు, కుక్కలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో పారిశుధ్యం సమస్యను పరిష్కరించాలని, పల్లెప్రగతి పనుల ద్వారా పనులు చేపట్టి పల్లెలను బాగు చేయాలని కోరుతున్నారు.
సర్పంచుల పదవీకాలం పూర్తయిన తర్వాత బిల్లులు అందక కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకపక్క బోరు మోటార్లు బాగు చేయించడం, పైప్లైన్ లీకేజీలకు మరమ్మతును చేయించడం చేశారు. ఎఫ్డీఎఫ్ నిధులు వస్తాయని అధికారులు చెప్పడంతో పనులు చేయించి ఏడాదికాలంగా కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు.