ఇల్లెందు, మే 28: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. ఇల్లెందు 15వ నెంబర్ బస్తీ 13వ వార్డుకు చెందిన దుర్గాప్రసాద్ పాసి అనే ఆటోడ్రైవర్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్ ఇల్లెందు జగదాంబ సెంటర్ ఆటో అడ్డాకు చెందిన ఆటోడ్రైవర్. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ బుధవారం దుర్గాప్రసాద్ ఇంటికెళ్లి అతడి మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం పెట్టి ఆటో కార్మికులను మర్చిపోవడం సరికాదని, ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం కూడా పూర్తి కావస్తున్నప్పటికీ అతీగతీలేదన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. 13వ వార్డు నాయకులు కడగంచి వీరస్వామి, రామ్‌లాల్ పాసి, టీఏడీయూ నేతలు సముద్రాల తిరుమల, మద్ది మల్లేశ్, చందు, అశోక్, నవాబ్, యాకుబ్, శివ, సందీప్, మేకల శీను, సలీం పాషా, రాజేశ్ పాల్గొన్నారు.
మృతదేహంతో ఆటో యూనియన్ ర్యాలీ..
రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలు సరిగా సాగక ఆటోడ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే దుర్గాప్రసాద్ పాసి మృతిచెందాడని ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆటో యూనియన్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి దుర్గాప్రసాద్ మృతదేహంతో ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జగదాంబ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.