వేంసూరు, మే 11 : రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన మక్కలను కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మర్లపాడు, కల్లూరుగూడెంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం సండ్ర సందర్శించారు. అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి పంట పండించిన రైతులు అమ్ముకోవడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.
కొనుగోలు కేంద్రాలు రైతు కేంద్రాలుగా పని చేయాలి గానీ, రాజకీయ కేంద్రాలుగా మార్చొద్దని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. కొనుగోళ్లలో రోజుల తరబడి జాప్యం చేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో క్వింటా మక్కలకు రూ.800, ధాన్యం క్వింటా రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కల్లూరుగూడెం గోదాం వద్ద వందకు పైగా లారీలు, ట్రాక్టర్ల ద్వారా మక్కలు వస్తున్నప్పటికీ కేవలం 20 మంది హమాలీలతోనే దిగుమతులు నిర్వహించడం దారుణమన్నారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికార యంత్రాంగం, స్థానిక నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని సండ్ర హెచ్చరించారు. కేంద్రాల్లో హమాలీల సంఖ్య పెంచి, రైతులకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సండ్ర వెంట బీఆర్ఎస్ నాయకులు పగుట్ల వెంకటేశ్వరరావు, కంటే వెంకటేశ్వరరావు, పుచ్చకాయల శంకర్ రెడ్డి, యర్రా రమేశ్, గొర్ల ప్రభాకర్‌రెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, మందపాటి మహేశ్వర్‌రెడ్డి, గరిగంటి రాంబాబు, చక్రధర్‌రావు, దొడ్డ చెన్నకేశవరెడ్డి, కరుణాప్రసాద్, వెంకటకృష్ణారెడ్డి, గొర్ల రామ్మోహన్‌రెడ్డి, లీల లోకేశ్వర్‌రెడ్డి, పాల గంగాధర్‌రెడ్డి, సాధులక్ష్మి, సాధు శివ తదితరులు ఉన్నారు.