ఖమ్మం, ఫిబ్రవరి 22 : ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుదారుల సమస్య ఇప్పటికైనా పరిష్కారం అవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేండ్లకుపైగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్న ప్లాట్ల కొనుగోలుదారులకు ఇప్పుడైనా రెగ్యులరైజేషన్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో సరిపడా సిబ్బంది లేని కారణంగా గతంలో మాదిరిగా ఉండే అవకాశాలు ఉన్నవి. ప్రభుత్వం సిబ్బందిని పెంచకపోతే ఎల్ఆర్ఎస్ పూర్తిచేయడం కష్టమని పలువురు అధికారులే పేర్కొంటున్నారు. మార్చి 31వ తేదీలోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే 25 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనధికారిక లే అవుట్లలో కేవలం పదిశాతం ప్లాట్లు రిజిస్టర్ అయి ఉండి.. మిగిలినవి రిజిస్టర్ కాకపోతే 90 శాతం ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొత్తదనమేమీ లేదు.
ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టినప్పుడే ఆ అవకాశం కల్పించారు. దీంతో చాలా మంది రియల్టర్లు, అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు మొదట్లో రూ.10 వేల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత రూ.1000 చొప్పున వసూలు చేశారు. అయినా క్రమబద్ధీకరణ జరగలేదు. ప్లాట్ కొనుగోలుకు సంబంధించిన సేల్ డీడ్ ఉన్నవారికి కూడా 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తాజాగా చేసిన ప్రకటన కొంత ఊరట కలిగిస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఈ రాయితీతోనైనా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో కదలికవస్తుందా అనేది సందేహమే.. గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా దరఖాస్తుదారుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తకువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో వేలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇలాంటి ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో ప్లాట్ల యజమానులు దయనీయస్థితిని ఎదురొంటున్నారు. ఈ దుస్థితిని తొలగించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం 2015లో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని తెచ్చింది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో రూ.10 వేల చొప్పున చెల్లించి ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ నిలిచిపోయింది.
ఎస్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నవారికి భవన నిర్మాణ అనుమతుల్లో కొంత వెసులుబాటు కల్పించినా ఆశించిన మేరకు క్రమబద్ధీకరణ జరగలేదు. ఆ తరువాత 2020 ఆగస్టులో ప్రభుత్వం మరో జీవో తీసుకొచ్చింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.వెయ్యి చొప్పున చెల్లించేందుకు అవకాశం కల్పించారు. క్రమబద్ధీకరణకు స్థలం విలువ లెకింపునకు ప్రభుత్వం శ్లాబులవారీగా కూడా ధరలు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ చార్జీలు తగ్గిస్తూ 2020లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదరపు గజం ధర ఆధారంగా క్రమబద్ధీకరణ కోసం చార్జీల స్లాబుల సంఖ్యను పెంచింది. నిర్దేశించిన ఖాళీ స్థలాలు వదలని చోట్ల చెల్లించాల్సిన రుసుము రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ నిర్ణయించే ధరను ప్రాతిపదికగా చేసింది. ప్రత్యేకంగా నాలా చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఈ క్రమబద్ధీకరణ పథకం జీవో 131 ప్రకారం స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అప్పట్లోనే ప్రారంభమైంది. ఈ మేరకు అనుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఖమ్మం కార్పొరేషన్లో 9,942 దరఖాస్తులు రాగా.. 3,735 అనుమతి పొందాయి. వీటిలో 939 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు. మధిర మున్సిపాలిటీలో 4,276 దరఖాస్తులు రాగా.. 1,488 అనుమతి పొందగా 97 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 3,688 దరఖాస్తులు రాగా.. 2,391 అనుమతి పొందాయి.. వీటిలో 62 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు. వైరా మున్సిపాలిటీలో 3,516 దరఖాస్తులు రాగా.. 1,237 అనుమతి పొందగా వీటిలో 48 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు. సుడా పరిధిలో 34,391 దరఖాస్తులు రాగా.. 7 మాత్రమే అనుమతి పొందగా వీటిలో 4 దరఖాస్తులకు ఫీజు చెల్లించారు.
ఉచిత హామీని నిలబెట్టుకోవాలి
అధికారంలోకి వస్తే లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చింది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేసిన ఎల్ఆర్ఎస్ ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం అన్న హామీని కాంగ్రెస్ విస్మరించింది. కాంగ్రెస్ వస్తే నయా పైసా కట్టకుండా ప్లాట్లు, లే అవుట్లు క్రమబద్ధీకరించుకోవచ్చునని ఎదురుచూస్తున్న సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఇది సరైనది కాదు. నాడు ఎల్ఆర్ఎస్ విషయంలో కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఖజానా నింపుకునేందుకు పేదలపై గుదిబండ మోపుతున్నాడు.
– చిలుమూరు కోటి, 2వ డివిజన్, ఖమ్మం
50 శాతం రాయితీ ఇవ్వాలి..
ఎల్ఆర్ఎస్కు 25 శాతం రాయితీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ సామాన్య ప్రజలను మోసగిస్తోంది. పేదలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు 50 శాతం ఇవ్వాలి. ఐదేళ్లుగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురుచూస్తున్న ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. అధికారంలోకి రాకముందు ఓట్లు కొల్లగొట్టేందుకు సాధ్యంకాని హామీలను ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ విషయంలో మాట మార్చడం కాంగ్రెస్ మోసపూరిత విధానాలకు నిదర్శనం.
– హెచ్చు ప్రసాద్, 4వ డివిజన్, ఖమ్మం