రఘునాథపాలెం, జనవరి 25 : ఎన్నికలంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందా..? గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల ‘షాక్’ భారీగా తగిలిందా..? పార్టీ గుర్తు లేకుండానే ప్రతికూల ఫలితాలు చవిచూసిన హస్తం పార్టీ.. ఇక పార్టీ గుర్తుపై ఎన్నికల నిర్వహణకు జంకుతోందా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిన్న మొన్నటివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలే ఉండవు.. నామినేటెడ్ పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక అంటూ ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్) సైతం ఎన్నికలు లేవని ఘంటాపథంగా చెప్పుకుంటోంది.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. కనీసం సగం సర్పంచ్ స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. 50శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పట్టినట్లు అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహిస్తే ‘సేమ్ సీన్’ రిపీట్ అవుతుందనే భయం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. దీంతో సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం కంటే నామినేటెడ్ పద్ధతిలో వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)కు సుమారు లక్షకుపైగా సభ్యులు ఉన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా నాన్ అఫీషియల్ పద్ధతిలో కమిటీలను వేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సాగిస్తోంది. ఖమ్మంజిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా మార్కెటింగ్ సహకార సంఘం (డీసీఎంఎస్) చైర్మన్లు, డైరెక్టర్లను సైతం ఇదే తరహాలో ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. 2025 ఫిబ్రవరిలోనే సహకార సంఘాల పాలకవర్గాలకు గడువు ముగిసింది. కొన్నిచోట్ల పాత పాలకవర్గాల గడువు పొడిగించి నడిపించారు.
ఖమ్మం జిల్లాలోనూ ఇదే తరహా కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలకవర్గాల చైర్మన్లు ఉన్న సొసైటీలకు గడువు పొడిగించి నడిపించారు. బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్న సొసైటీల పాలకవర్గాల గడువును సైతం పొడిగించాలని నాడు ఖమ్మంజిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌లు ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. దీంతో దిగొచ్చిన సర్కార్ ఆయా పాలకవర్గాలనూ పొడిగించింది. ఇటీవల అన్నింటినీ రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కొత్త పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండానే నామినేటెడ్ పద్ధతిలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్, డైరెక్టర్ల నియామకం చేపట్టాలని భావిస్తోంది. ఏమాత్రం చేతికి మట్టి అంటకుండా సొసైటీల పదవులను నామినేటెడ్ పద్ధతిలో తమ ఖాతాలో వేసుకోవాలనే ఆలోచనలో అధికార పార్టీ వ్యూహరచన చేస్తున్నది.
రైతులకు సంక్షేమ పథకాలకు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే ఘోర పరాభవం తప్పదని జంకుతోంది. రెండేళ్లుగా యూరియా కోసం రైతులను తీవ్ర కష్టాలకు గురిచేసింది. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో లేని యూరియా తిప్పలు.. మళ్లీ కాంగ్రెస్ వచ్చినంక కొరత తీవ్రంగా కనిపించింది. గంటలు, రోజులకొద్దీ సొసైటీల వద్ద క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. క్యూలో చెప్పులు పెట్టి గంటలకొద్దీ నిలబడాల్సిన దుస్థితి. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘రైతుభరోసా’ డబ్బులు ఖాతాకు చేరుతాయనే నమ్మకమే రైతులకు లేకుండాపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పేరు ఎత్తితేనే కర్షకులు మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహకార సంఘాల ఎన్నికలకు పోతే కాంగ్రెస్‌పై ఉన్న తీవ్ర వ్యతిరేకత బయటపడుతుందనే భయంతో ‘నామినేటెడ్’ ప్రచారాన్ని సాగిస్తోంది.
గ్రామాల్లో సాధారణ ఎన్నికలను తలపించేలా సొసైటీలకు సైతం హోరాహోరీగా ఎన్నికలు జరిగేవి. రాజకీయ, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండే ఈ సహకార సంఘాల ఎన్నికలకు మంచి డిమాండ్ ఉంది. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం వ్యవసాయరంగానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం, రైతులకు ఆర్థికంగా చేయూతను అందించడం సహకార సంఘాల లక్ష్యం. రాజకీయంగా పలుకుబడి పెంచుకునేందుకు కూడా ఈ పదవులు ఎంతగానో దోహదపడుతాయి.
సొసైటీలకు చైర్మన్‌గా ఉంటే దాని పరిధిలో ప్రొటోకాల్‌తోపాటు మండల సభల్లో సభ్యుడిగానూ హాజరయ్యే అవకాశం ఉంటుంది. సొసైటీ పరిధిలో పరిచయాలూ పెరుగుతాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన సొసైటీ పదవులకు ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలోనే నామినేటెడ్‌గా పాలకవర్గాల నియామకం ఉంటుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. దీంతో ఆయా పదవులను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సొసైటీ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.