అపర భగీరథుడైన కేసీఆర్పై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆయన ముద్రను తెలంగాణ సమాజం నుంచి చెరిపేసేందుకు విశ్వప్రయ త్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. పూర్తిగా రాజకీయ కక్షసాధింపు ధోరణి అవలంబిస్తున్నట్లు అనేక విషయాల్లో స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దాహార్తి కోసం ప్రజలు అల్లాడుతున్నా దయలేకుండా వ్యవహరిస్తోంది.
ఇందుకు మిషన్ భగీరథ పథకం ప్రత్యక్ష సాక్ష్యంగా కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇంటింటికీ శుద్ధజలాలు అందించాలని సంకల్పించిన గత ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పాలనలో ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. అన్ని గ్రామాల్లోనూ వాటర్ ట్యాంకులు నిర్మించారు. ఇంటింటికీ పైపులైన్లు వేశారు. ఆయన పాలనలో అన్ని గ్రామాలకూ తాగునీటిని సజావుగా అందించారు. అయితే, ఆయన పదేళ్ల పాలన పూర్తయ్యే రోజుల నాటికి మరికొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణాలు, పైపులైన్లు, ట్యాంపుల ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి.
ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ గ్రామాల్లోనూ భగీరథ పనులు పూర్తయ్యేవి. ప్రతి ఇంటికీ నూరు శాతం శుద్ధజలాలు అందేవి. కానీ.. మోసపు హామీలతో 16 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజోపయోగ పథకాలను పక్కనబెట్టింది. కేవలం కేసీఆర్ పొడగిట్టని కారణంగా.. ఆయన తెచ్చిన అద్భుత పథకాలను నీరుగారుస్తోంది. తాజాగా మిషన్ భగీరథను కూడా ఆ జాబితాలో చేర్చింది. కేవలం భగీరథ ఉద్దేశాన్ని భగ్నం చేసేందుకే కాచుకొని కూర్చుంది. ఈ క్రమంలో తాగునీళ్లందక ప్రజల గొంతెం డుతున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఈ కథనంలోని రెండు మండలాలను పరిశీలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
-చుంచుపల్లి/ చర్ల, ఏప్రిల్ 2
భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలాన్ని పరిశీలిస్తే.. భగీరథ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో అర్థమవుతోంది. ఈ మండలంలోని నందాతండాలో గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ వాటర్ ట్యాంకును నిర్మించింది. వీధివీధికీ పైపులైన్లు వేసింది. ప్రతి ఇంట్లోనూ నల్లాలు బిగించింది. వాటికి కనెక్షన్లు ఇచ్చే సమయానికి కేసీఆర్ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సరిగ్గా అప్పటి నుంచే ఈ గ్రామ ప్రజలకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మించి సిద్ధంగా ఉన్న మిషన్ భగీరథ ట్యాంకును మూలనపడేసింది. నల్లాల కనెక్షన్లను నట్టేట ముంచింది.
దీంతో గత కేసీఆర్ ప్రభుత్వం నోటికాడి దాకా తెచ్చిన తాగునీటిని కాంగ్రెస్ ప్రభుత్వం కాలదన్నినట్లయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ ట్యాంకు నిండా నీళ్లు నింపిన అధికారులు.. ఇళ్లకు మాత్రం సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మిషన్ భగీరథ ఏఈ వసంతకుమారిని వివరణ కోరగా.. పైపులైన్లను గతంలోనే వేశామని, ట్యాంకులో నీటిని కూడా నింపామని అన్నారు. అయితే, ఇళ్లలోని నల్లాలతో వాటికి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. దీనికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని, త్వరలోనే నందాతండా గ్రామస్తులకు తాగునీటిని సరఫరా చేస్తామని సమాధానమిచ్చారు.
భగీరథ నీరు రావడం లేదు..
మా కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. ఇంటింటికీ శుద్ధ జలాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వంలో పైపులైన్లు వేశారు. వాటర్ ట్యాంకును కూడా నిర్మించారు. కానీ.. నీటిని మాత్రం సరఫరా చేయడం లేదు. దీంతో అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ బోరు నీళ్లు తాగక తప్పడం లేదు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఇవ్వాలని వేడుకుంటున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండడం లేదు.
-జగ్గమ్మ, గృహిణి, హౌసింగ్ బోర్డు కాలనీ
బోరు నీళ్లను తాగలేకపోతున్నాం..
మా గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు. దీంతో బోరు నీటినే తాగుతున్నాం. మిషన్ భగీరథ నీళ్లయితే శుద్ధి చేశాక వస్తాయి కాబట్టి నిర్భయంగా తాగొచ్చు. కానీ.. బోరు నీళ్లలో గ్యారెంటీ ఉండదు కదా. పైగా మా గ్రామంలో భగీరథ ట్యాంకు నిర్మించి కూడా నీటిని సరఫరా చేయడం లేదు. అయితే, కరెంటు నిరంతరం ఉండని కారణంగా బోరు నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదు.
-మూడ్ జయరాంనాయక్, నందాతండా
గోదారి ఒడ్డునున్నా గొంతెండుతోంది..
చర్ల మండల ప్రజలదీ మరింత దయనీయ పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలకు కూడా గొంతెండుతున్న స్థితి. ఈ మండలంలోని కొత్తపల్లి గ్రామం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది. అయినప్పటికీ బోర్లలో నీళ్లు అడుగంటాయి. అందుకు ప్రత్యామ్నాయంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపానపోవడం లేదు. భగీరథ ద్వారా కేవలం అంతంతమాత్రంగానే తాగునీటిని సరఫరా చేస్తూ చేతులు దులుపుకుంటోంది. కనీసం మూలనపడ్డ బోర్లకు మరమ్మతులు కూడా చేయించడం లేదు.
అయితే, తమకు తాగునీరు అందించాలని కోరుతూ ఆర్.కొత్తగూడెం, కలివేరు గ్రామాల ప్రజలు ఇటీవల రోడ్డెక్కి ఆందోళనలు చేసినా అది అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇక పంటలకు సాగునీళ్లు అందించే అంశంలోనూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అన్నదాతలు సాగు చేస్తున్న మిర్చి, వరి పంటలు ఎండిపోతున్నా సర్కారు నుంచి స్పందన ఉండడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ పంటలు కాపాడుకునేందుకు అనేక తంటాలు పడుతున్నారు. కొందరు రైతులైతే ట్యాంకర్లతో నీటిని తెచ్చి పొలాలకు పెట్టుకుంటున్నారు. అంత ఖర్చు భరించలేని రైతులు.. ఎండిపోతున్న పంటలను చూసి తల్లడిల్లిపోతున్నారు. లింగాపురంపాడు, పాత చర్ల పెద్ద చెరువులు అడుగంటడంతో దిక్కుతోచని స్థితిలో ఆశలు వదులుకుంటున్నారు.
బోరు మరమ్మతులకు గురై ఆరు నెలలైంది.
మా ఊరిలో బోరు మరమ్మతులకు గురై ఆరు నెలలు దాటిపోయింది. తమ గ్రామంలో తాగునీటి సమస్యను అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కానీ.. సర్కారు నుంచి స్పందన రాలేదు. ఇప్పటివరకు బోరును బాగుచేయించలేదు. భగీరథ నీటిని అంతంతమాత్రంగానే అందిస్తున్నారు. గోదావరి ఒడ్డున ఉన్నా తాగునీటికి తిప్పలు తప్పడం లేదు.
-బట్టా వెంకటలక్ష్మి, కొత్తపల్లి
మిర్చితోట ఎండింది..
మా ఊరి చెరువు కింద మూడెకరాల్లో మిర్చి సాగు చేశా. ఈ ఏడాది చెరువు అడుగంటింది. చెరువు నీరు రాకపోవడంతో పంట ఎండిపోతోంది. ఎకరానికి రూ.లక్షన్నర వరకూ ఖర్చుచేశాను. ఇప్పుడు నీరు అందకపోవడంతో చేసేదీమీలేక పంటను వదిలేశాను. మా ఊరి రైతులం యాసంగిలో ఈ చెరువు కింద 60 ఎకరాల్లో మిర్చి, 20 ఎకరాల్లో వరి సాగుచేశాం. అందరి పంటలూ ఎండిపోతున్నాయి.
-బైరి సుధాకర్,లింగాపురంపాడు
పంట చేతికొస్తుందన్న ఆశ లేదు..
మా ఊరి పెద్ద చెరువును నమ్ముకొని ఆరు ఎకరాల్లో యాసంగి వరి పంట వేశాను. ఇప్పుడు చెరువులో నీరు అడుగంటింది. పంట కంకితీసే సమయానికి సాగునీరు అందడం లేదు. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా తడులు పెడుతున్నాను. కొంతైనా పంట చేతికి వస్తుందనే ఆశతోనే శ్రమిస్తున్నాను. కానీ.. పంట చేతికొస్తుందన్న నమ్మకమైతే లేదు.
-గోసంగి రమేశ్, చర్ల