రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి నట్టేట ముంచింది. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి రుణమాఫీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు భంగపాటు తప్పలేదు. ఇప్పటివరకు రెండుసార్లు విడుదల చేసిన రుణమాఫీ జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు తమకు రుణమాఫీ రాలేదో అర్థంకాక తికమకపడుతున్నారు.
బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడుతున్నారు. అధికారులను అడిగితే.. మరో జాబితాలో మీ పేరు ఉంటుందని కొందరు, మాకు కూడా ఏమీ తెలియదంటూ కొందరు సమాధానం చెబుతున్నారు. మొత్తానికి రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– ఖమ్మం, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పంటల రుణమాఫీకి సంబంధించి కోతలు, కొర్రీల ప్రక్రియ రెండోవిడతలోనూ కొనసాగింది. ప్రతిఒక్కరికీ పంట రుణమాఫీ కాకుండా అనేక ఆంక్షలతో వడపోత చేపట్టడం పట్ల అర్హత కలిగిన రైతులు రుణమాఫీకి దూరమవుతున్నారు. తొలివిడతలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితా వెలువడిన తరువాత జాబితాలో పేర్లు లేని వందలాది మంది రైతులు సొసైటీలు, బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. అయితే సాంకేతిక కారణాలు, ఇతర పొరపాట్ల వల్ల పేర్లు రాలేదని మరో విడతలో తప్పకుండా పేర్లు వస్తాయని నమ్మబలికారు.
దీంతో రెండోవిడత జాబితా విడుదల అయినప్పటికీ మొదటివిడతకు సంబంధించిన రైతుల జాబితాలో అక్కడక్కడ కొందరి పేర్లు మాత్రమే రావడం జరిగింది. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల పంట రుణాలు తీసుకున్న రైతుల పేర్లు సైతం మాయంకావడంతో అర్హత కలిగి రుణమాఫీ కానీ రైతుల సంఖ్య మరింత పెరిగినైట్లెంది. ఈ ప్రభావం ప్రైవేట్ బ్యాంకుల కంటే జిల్లా సహకార బ్యాంకు పరిధిలోని ఆయా బ్రాంచీలు, సహకార సంఘాల్లో మరింత కనపడింది. దీంతో డీసీసీబీ పరిధిలోని అనేకమంది రైతులకు మరోసారి నిరాశ ఎదురైంది.
జిల్లావ్యాప్తంగా నేటివరకు రెండు విడతలు కలిపి సుమారుగా 91,973 మంది రైతులకు రూ.520.76 కోట్లు విడుదలయ్యాయి. మొత్తం మూడు విడతలుగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు విడుదల చేయనున్నారు. ఈ నెల 18వ తేదీన తొలివిడతకు సంబంధించి రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న 57,857 మంది రైతులకు రూ.258,25,75,452 విడుదల చేశారు. రెండోవిడతలో భాగంగా 30వ తేదీన రూ.లక్ష నుంచి లక్షన్నర పంట రుణాలు తీసుకున్న 34,111 మంది రైతులకు రూ.262,50,56,893 రుణమాఫీ జరిగినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
దీంతో రెండు విడతలు కలిపి జిల్లావ్యాప్తంగా 91,973 మంది రైతులకు రూ.520,76,32,345 రుణమాఫీ జరిగినైట్లెంది. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్‌లోపు రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తింపచేశారు. నేటివరకు రెండువిడతల్లో కలిపి రూ.1.50 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ జరగగా, మిగిలిన రైతులకు రూ.1.50 లక్షలపైగా పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టత రావాల్సి ఉంది.
2018 సంవత్సరం డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. అయితే ఈ గడవులో జిల్లావ్యాప్తంగా రైతులు ఏఏ బ్యాంకుల్లో రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్నారు. వారికి ఎన్ని నిధులు అవసరం ఉంటుంది.. అనే వివరాలపై నేటివరకు స్పష్టత లేదు. సాధారణంగా జిల్లా లీడ్ బ్యాంక్ రుణమాఫీ ప్రకటించిన సమయంలో ఆయా బ్యాంకుల నుంచి వివరాలు సేకరించి, అర్హత కలిగిన వారి సంఖ్యను ప్రకటిస్తుంది.
గడిచిన ఆరునెలల నుంచి రుణమాఫీ పథకంపై చర్చ జరుగుతున్నప్పటికీ నేటివరకు సైతం అసలు పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య ప్రకటించకపోవడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. దీంతో రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారు. వారిలో ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షలు పోను ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హత పొందారో తెలియని అయోమయ పరిస్థితి జిల్లావ్యాప్తంగా నెలకొంది. జాబితాలో పేరు వస్తే ఉన్నట్లు లేకపోతే లేనట్లు అన్న రీతిలో క్షేత్రస్థాయిలో రైతుల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు మొత్తం అర్హత కలిగిన రైతుల వివరాలను ప్రకటిస్తే రుణమాఫీ ప్రక్రియలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతి యేటా మూడెకరాల వరి పంట సాగుచేస్తున్నాను. పంట పెట్టుబడికి దమ్మపేట సొసైటీలో రుణం తీసుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తారని ఆశించాను. రుణమాఫీ కాలేదు. దీనికి తోడు వరి పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. ప్రైవేటు అప్పులు చేస్తే అధిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. అసలే అంతంతమాత్రంగా ఉన్న సాగుతో ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి.
– కట్ల రాజు, మల్లారం, దమ్మపేట మండలం
నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. పంటలు సరిగా పండక అప్పులయ్యాయి. రుణమాఫీ జరిగితే కొంత ఆసరా అవుతుందనుకున్నా. రేషన్‌కార్డు లేకపోవడంతో రుణమాఫీ అర్హుల జాబితాలో నాకు చోటుదక్కలేదు. వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడ తీసుకురావాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. రుణమాఫీకి ఆశపడి భంగపడ్డాను.
– వాడపల్లి జకరయ్య, మొద్దులగూడెం, దమ్మపేట మండలం