మధిర రూరల్, ఏప్రిల్ 18 : ఆరు గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మోసాల ప్రభుత్వంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారాన్ని చేజికించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఖాజీపురంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నస్రీన్ సుల్తాన ఆలీ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను వంచనకు గురిచేస్తోందని మండిపడ్డారు.
వృద్ధులు, మహిళలు, రైతులను అన్ని విధాలా నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను చూసి ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన పేరొన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మారెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల వీరారెడ్డి, ఆళ్ల నాగబాబు, మారెట్ మాజీ డైరెక్టర్ అజీమ్, వార్డు సభ్యుడు అఫ్రోజ్, నాయకులు పాల్గొన్నారు.