నటన ఓ వరం. సినిమాల్లో అవకాశం రావడం అదృష్టం. కానీ,రంగస్థలంపై రాణించాలంటే ప్రతిభతోపాటు జిజ్ఞాస కూడా ఉండాలి. అలాంటి తపన కలిగిన తెలంగాణ బిడ్డ ముంబై రంగస్థలంపై నటిగా సత్తా చాటుతున్నది. మరాఠీ,హిందీ, ఇంగ్లిష్ నాటకాల్లో రకరకాల పాత్రలు పోషిస్తూ, పాత్రోచితంగా నటిస్తూ అందరి ప్రశంసలూ అందుకుంటున్న చిలుక జిజ్ఞాస జర్నీ ఇది..
టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న చిలుక జిజ్ఞాస సొంతూరు సిరిసిల్ల. ఆమె కుటుంబం థానేలోని కల్వా ప్రాంతంలో స్థిరపడింది. చిన్న వయసు నుంచే రంగస్థలంపై మమకారం పెంచుకున్నది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నటనకు శ్రీకారం చుట్టింది. మరాఠీతోపాటు హిందీ, ఇంగ్లిష్ నాటకాల్లోనూ రాణిస్తున్నది. జిజ్ఞాస తండ్రి శేఖర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగి. తల్లి వైదేహి సైకాలజీలో, యోగాలో మాస్టర్స్ చేసి యోగా గురువుగా పనిచేస్తున్నది. ఈ దంపతులిద్దరికీ నాటకాలంటే ఇష్టం. స్థానికంగా ఉన్న మరాఠీ ఆర్ట్ థియేటర్లో సభ్యులుగా ఉన్నారు. వారాంతాల్లో నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ ఉంటారు. స్వతహాగా మంచి గాయకుడైన శేఖర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తుంటారు. తల్లిదండ్రులిద్దరికీ కళా తృష్ణ ఉండటంతో.. వారి కూతురు జిజ్ఞాస, కొడుకు సోహంలను చిన్నప్పటి నుంచి నాటకాలకు తీసుకెళ్తూ ఉండేవారు. అలా జిజ్ఞాసకు బాల్యం నుంచే రంగస్థలంతో ముడిపడింది. తాను కూడా గొప్ప నటిగా అందరి ప్రశంసలు అందుకోవాలన్న జిజ్ఞాస ఆమెలో మొగ్గతొడిగింది.
చిన్నప్పటి నుంచీ నాటకాల్లో పాల్గొంటున్నా.. చదువును ఏ మాత్రం అశ్రద్ధ చేయలేదు జిజ్ఞాస. కెమికల్ ఇంజినీరింగ్ చదివింది. కానీ, నటననే కెరీర్‌గా ఎంచుకోవాలన్న ఆశయంతో ఉంది. ఈ మేరకు ప్రముఖ ఆర్ట్ థియేటర్ గ్రూప్ ‘డీ ఫర్ డ్రామా’తో జట్టుకట్టింది. అతుల్ కుమార్ దర్శకత్వంలో ‘అంబా’ నాటకంలో కీలక పాత్ర షోషించి అందరినీ మెప్పించింది. గ్రీకు నాటకం ఆధారంగా రూపొందిన ఈ నాటకం హిందీ, బుందేలీ బాషల్లో ప్రదర్శించారు. ముంబైలోని పృథ్వీ థియేటర్‌తోపాటు ఢిల్లీ, లక్నోలోనూ ప్రదర్శితమైన ఈ నాటకంతో రంగస్థలంపై జిజ్ఞాసకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే అమృత ప్రీతం కథల ఆధారంగా రూపొందిన నాటకం, ధూమ్రపాన్, డెత్ ఆఫ్ ఎ సేల్స్‌మ్యాన్ తదితర నాటకాల్లో ప్రముఖ భూమిక పోషించి నటిగా మార్కులు కొట్టేసింది. డెత్ ఆఫ్ ఎ సేల్స్‌మ్యాన్ నాటకంలో పాతికేండ్ల యువతిగా, ఆరుపదుల వృద్ధురాలిగా రెండు పాత్రలు పోషించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్నది జిజ్ఞాస.
‘నా కెరీర్లో గొప్ప నాటకం ‘ఆఫ్ మైస్ అండ్ మెన్’. దీనిని మైసూర్ దగ్గరి హెగుడు గ్రామంలో ప్రదర్శించాం. దాదాపు 35 మంది ఆర్టిస్టులం కలిసి రెండు వారాలు రిహార్సల్స్ చేశాం. లబ్ధప్రతిష్ఠులైన నటులతో కలిసి ఆ నాటకంలో పాల్గొనడం నాకు గొప్ప తృప్తినిచ్చింది. నా అనుభవం తక్కువే అయినా.. అలాంటి అవకాశం రావడం, దానిని సద్వినియోగం చేసుకోవడం గొప్పగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది జిజ్ఞాస. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ప్రదర్శనలు ఇస్తున్న ఆమె ఒప్పో, ఫోన్ పే లాంటి సంస్థలకు సంబంధించిన ప్రకటనల్లోనూ నటించింది. టాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’, ‘జనక అయితే గనక’ చిత్రాల్లో కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నచిన్న వీడియోలు మొదలుపెట్టిన జిజ్ఞాస సినిమాల్లోకి రావాలని ఉందని చెబుతున్నది. తన ఆశయాన్ని అందుకోవడంలో భాగంగా ఓ మరాఠీ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది. ‘సినిమా రంగంపై అవగాహన పెంచుకోవాలి. రంగస్థలంపై బిజీగా ఉన్నా.. సినిమా మాధ్యమం చాలా పెద్దది. అందులోనూ రాణించాలని ఉంది. అందుకే ఓ కాస్టింగ్ కంపెనీలో చేరాను. కంటెంట్ రైటర్‌గానూ ప్రయత్నిస్తున్నాను. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే.. ప్రేక్షకులను అలరించడానికి నేను సిద్ధం’ అంటున్నది జిజ్ఞాస. ముంబై గడ్డ మీద వెలుగొందుతున్న ఈ తెలంగాణ తేజాన్ని వెండితెరపై కీలక పాత్రల్లో చూడాలని మనమూ కోరుకుందాం.
– పాసికంటి శంకర్, భివండీ