ఖమ్మం, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక్ష్యాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండాపోయింది. కాంగ్రెస్ సర్కారులో కర్షకులు పండించిన ధాన్యం అమ్ముకోవడం కష్టాలను తెచ్చిపెడుతోంది. కొనుగోళ్లు పూర్తయి రోజులు గడుస్తున్నా తోలకాలు లేకపోవడంతో అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.
లారీల కొరత, మిల్లులకు అలాట్మెంట్ లేకపోవడం, ప్రభుత్వ గోదాములు లేకపోవడం వంటి కారణాలతో ధాన్యం తరలింపు పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం విపరీతమైన ఎండలకు ఎండి పగిలిపోతూ నూగులా మారుతోంది. మరోవైపు, వర్షం వస్తే తడిసిపోతుందేమోననే భయంతో రైతులందరూ రేయింబవళ్లూ కేంద్రాల వద్దనే కాపలా ఉండి పంటను కాపాడుకుంటున్నారు. ఐకేపీ అధికారులు మాత్రం గోదాములు ఖాళీగా లేవని, మిల్లులకు ఇంకా అలాట్మెంట్లు రాలేదని చెబుతున్నారు.
ధాన్యం తరలింపు కోసం రైతులకు అదనపు భారం తప్పడం లేదు. లారీల కిరాయి, హమాలీల ఖర్చులు, ఇతర వ్యయాల పేరుతో ఒక్క లారీ లోడింగ్‌కు రూ.30 వేల వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వమే గన్నీ బ్యాగులను సమకూర్చాల్సి ఉన్నప్పటికీ సమకూర్చకపోవడంతో రైతులే సొంతంగా తెచ్చుకుంటున్నారు. వీటన్నింటి రూపేణా ఒక్క బస్తా లోడింగ్ చేసే వరకు రైతుకు రూ.60 ఖర్చు వస్తోంది.
ఇప్పటికే పెట్టుబడుల భారంతో ఇబ్బందులు పడుతున్న తమపై ఈ అదనపు భారం మరింత కష్టాలను తెచ్చిపెడుతోందని అన్నదాతలు వాపోతున్నారు. లారీల సమస్య లేకుండా చేసి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపును త్వరితగతిన జరిగేలా చూడాలని కర్షకులు వేడుకుంటున్నారు. యాసంగి పంట కొనుగోలులో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 309 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.03 లక్షల మెట్రిక్ టన్నులకు మించి సేకరించారు. ఇంకా 1.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది.
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో కొనుగోళ్లు వేగంగా జరిగేవని, తమకు గౌరవంగా ఉండేదని రైతులు నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు., ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండేవారని, తరలింపు కూడా వేగంగా జరిగేదని చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం కేంద్రాల్లో అవినీతి, అస్తవ్యస్త వ్యవస్థ రాజ్యమేలుతోందని ఆరోపిస్తున్నారు.
ముదిగొండ మండలంలోని ముదిగొండ, లక్ష్మీపురం, సువర్ణాపురం గ్రామాల్లోని ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ బుధవారం పరిశీలిస్తే.. రైతుల కష్టాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ముదిగొండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి పేర్ల నమోదు కోసం పడిగాపులు కాశారు. వేలిముద్ర ఉన్నవారికి మాత్రమే అలాట్మెంట్ ఇచ్చారు. ముదిగొండ మండలంలో అలాట్మెంట్ అయిన రైతుల ధాన్యం కాంటాలు పూర్తయి మూడురోజులైనా ఎక్కడికి తోలకాలు జరపాలో తెలియక అధికారులు కూడా అయోమయం పాలయ్యారు. దీంతో రైతులందరూ కొనుగోలు కేంద్రాల వద్దనే నిరీక్షించారు. అయితే, కాంటాలు పూర్తయినా తోలకాలు లేకపోవడంతో రాత్రి వేళలో ధాన్యం రాసుల వద్దనే కాపలా కాయాల్సి వస్తోందని రైతులు వాపోయారు.
నేను ఆరెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. 200 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రంలో కాంటాలు వేసి నెల అవుతున్నా లోడ్లు పంపించే దిక్కు లేదు. బస్తాల్లో నింపిన మక్కలకు చెదలు పడుతోంది. సరుకును కల్లాల వద్దే ఉంచి వేలిముద్ర (థంబ్) వేయడానికి ఆఫీసుల చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నాం. ఒక రోజు ఒకచోట అంటే.. మరో రోజు మరొక చోట అని తిప్పుతున్నారు. పొద్దటి నుంచి సాయంత్రం వరకు ఉంచి ఈరోజు ఎలాట్మెంట్ లేదు రేపు రండి అని చెబుతున్నారు. ఈ పాట్లు పడలేక ఎంతో మంది రైతులు ఇప్పటికే దళారులకు అమ్ముకున్నారు. లోడ్ వెళ్లినా కూడా అన్లోడ్ అయ్యే వరకు మేము ఇబ్బంది పడాల్సి వస్తోంది.
-మొరిమేకల లింగయ్య, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం
మొక్కజొన్న సాగు చేస్తే 31 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకోవడానికి వస్తే కొనుగోలు కేంద్రాల్లో రైతులతోనే అన్ని ఖర్చులు పెట్టిస్తున్నారు.. మళ్లీ తిరిగి వస్తాయని చెబుతున్నా వచ్చే నమ్మకం లేదు. రైతు క్వింటాకు రూ.200 పైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 40 కేజీల టిక్కీ బస్తాకు రూ.100 చొప్పున ఖర్చు వస్తోంది. బస్తాలు మేమే కొనాలి. హమాలీ చార్జీలు మేమే భరించాలి. లారీ ఖర్చులు కూడా మేమే పెట్టుకోవాలి. లారీ వచ్చినప్పటి నుంచి మిల్లుకు వెళ్లి అన్లోడ్ చేసుకునే వరకు వెయిటింగ్ చార్జీలు ఇవ్వాలి. లారీ లోడు వెళితే 500 టిక్కీల బస్తాలకు రూ.5వేల పైగా ఖర్చు వస్తోంది. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేయాలి.
-కుర్రి నాగేశ్వరరావు, రైతు, సువర్ణాపురం, ముదిగొండ మండలం
నేను 20 ఎకరాల్లో మొక్కజొన్న, ఐదెకరాల్లో వరి సాగు చేశాను. పంట అమ్ముకునేందుకు ఎన్నిపాట్లు పడ్డానో ఆ దేవునికే తెలుసు. పండించిన పంటను అమ్ముకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలనలో ఉంది. రైతులు రోడ్డెక్కి గొడవ చేస్తే తప్ప మక్కలు, వడ్ల కొనుగోళ్లు ప్రారంభించలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక మంది రైతులు తక్కువ ధరకే దళారులకు పంటను అమ్ముకున్నారు. మొక్కజొన్నలు అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కాంటాలు వేసిన తర్వాత తమ సొంత ట్రాక్టర్లు, లారీల్లో బస్తాలను గోదాములకు తరలించి రోజుల తరబడి వాహనాల వద్ద పడిగాపులు కాస్తే తప్ప దిగుమతి కావడం లేదు. కాంగ్రెస్ అంటేనే కష్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
-జక్కుల వీరన్న, రైతు, కేశవాపురం, తిరుమలాయపాలెం మండలం