రఘునాథపాలెం, మార్చి 29 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని దుస్థితి. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న పంట కోతలు ముగుస్తున్నా.. నేటికీ కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ప్రతిపక్షాలు, రైతులు నెత్తీనోరూ బాదుకున్నా.. నిరసనలు, ధర్నాలు చేసినా కేంద్రాలు తెరిచిన పాపానపోలేదు. ఇక వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితీ అంతే.
ఇదే విషయంపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులతో ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. కొనుగోలు కేంద్రాల అంశాలపై చర్చించారు. ఏర్పాటు చేయాల్సిన కొనుగోలు కేంద్రాలెన్నో, ఎంత లక్ష్యంతో ముందుకెళ్తున్నామో చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గన్నీ బ్యాగుల ఏర్పాటు, రవాణా తదితరాలపై సమాలోచనలు. కానీ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాత్రం అమలుకు నోచుకోలేదు. ఫలితంగా ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లేక రైతులు ప్రైవేటుకు విక్రయించి మోసపోవాల్సి పరిస్థితి వస్తోంది.
ఖమ్మం జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. అయితే, ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం మాత్రం ఇంకా కొనుగోలు కేంద్రాలను మాత్రం తెరవలేదు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసిన అధికారులు.. తక్షణం ప్రారంభించాలనే విషయాన్ని గాలికొదిలేశారు. జిల్లాలోని నేలకొండపల్లి, కూసుమంచి, పాలేరు, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో కోతలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
దీంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటుకు విక్రయించి మోసపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు విక్రయించుకునే వీలు కల్పించకపోవడంతో గత్యంతరంలేక రైతులు ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లు, మిల్లులకు తరలిస్తుండగా, తరుగు పేరిట కిలోల కొద్దీ దోపిడీకి గురవుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా అసమర్ధ విధానాలను అవలంబిస్తుండడంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. వారి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులే పునరావృతమయ్యేలా కన్పిస్తున్నాయి.
పంటలకు నీరు కరువైంది. నానా ఇబ్బందులు పడి పండించిన పంటలను ఎలా విక్రయించుకోవాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పుష్కలంగా సాగునీళ్లు, 24 గంటల విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు, విత్తనాలతోపాటు పంట పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించి వ్యవసాయన్ని పండుగ చేశారు. అంతేకాకుండా రైతులకు రవాణా ఖర్చులు కూడా లేకుండా గ్రామగ్రామాన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. చివరి గింజ వరకూ కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించింది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు కొనుగొలు కేంద్రాలే కనిపించకపోవడం లేదు. ఆఖరి సమయంలో అక్కడో ఇక్కడో కొనుగుల కేంద్రాలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంటుండడం గమనార్హం.
ఖమ్మం జిల్లాలో వారం రోజులుగా పలు మండలాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. అధికారులు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో గత్యంతరంలేక రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మద్దతు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2,389గా ప్రకటించింది. దీనికి తోడు రూ.500 బోనస్ ఇస్తానంటోంది. దీంతో మొత్తంగా క్వింటా ధాన్యానికి రూ.2,800 వరకు వస్తుంది.
కానీ, ప్రైవేటు మార్కెట్లో ప్రస్తుతం రైతులు రూ.2,400 నుంచి రూ.2,500వరకు విక్రయించి మోసపోతున్నారు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు మద్దతు ధర వస్తుందని ఆశ పడుతున్న రైతుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కొనుగోలు కోసం అధికారులు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.