భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : “సర్కార్ ఉద్యోగం అంటే ఎంతో అదృష్టముంటేనే వస్తుంది.. అంతా సెటిల్ అయినట్లే.. పిల్లలకు ఇబ్బంది ఉండదు.. సొంత ఇల్లు ఉంటుంది.. రిటైర్డ్ అయ్యాక దర్జాగా బతకొచ్చు..” అని చాలామంది అనుకుంటారు.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. ఉద్యోగం నుంచి దిగిపోయారంటే దినదిన గండమే. ఎంతో ఆనందంగా ఉద్యోగ విరమణ చేసే రిటైర్డ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపెడుతున్నది. దాచుకున్న సొమ్ములు పైసా కూడా చేతికి రాకుండా చేయడంతో మనోవేదనతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకంగా 1,500 మందికి పైగా ఉద్యోగులు దిగిపోయి బెనిఫిట్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. మచ్చుకు కొంతమంది పరిస్థితిని పరిశీలిస్తే.. సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఇటు ఉద్యోగులు.. అటు ఉద్యోగ విరమణ చేసిన వారితో కాంగ్రెస్ సర్కారు దోబూచులాడుతున్నది. ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి చివరికి ఉద్యోగం నుంచి దిగిపోయిన వారికి సైతం దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికీ గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు ధర్నాలు, ర్యాలీలు చేసి నిరసనలు తెలిపినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇదే కొనసాగితే ఎంతోమంది దిగిపోయిన ఉద్యోగులు ఆసుపత్రిపాలై చనిపోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
“ఈ సారు పేరు ఎలిపే గమానియల్. భద్రాద్రి కొత్తగూడెం డీఈవో కార్యాలయంలో ఏడీగా పనిచేశారు. బదిలీపై ఆసిఫాబాద్ వెళ్లారు. అక్కడ డీఈవోగా ఉద్యోగ విరమణ చేశారు. నివసించేది భద్రాచలం. ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. పిల్లలు సెటిల్ కాలేదు. ఆరోగ్యం బాగానే ఉన్నా ఎంతో మనోవేదన చెందుతున్నారు. గెజిటెడ్ అధికారిగా ఉద్యోగ విరమణ చేసినా చివరికి అప్పులు తప్ప వేరే ఏమీ మిగలలేదు. రూ.60 లక్షల వరకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ రావాలి. తొమ్మిది నెలలుగా నరకం అనుభవిస్తున్నారు.”
“ఇతని పేరు శ్రీనివాసరావు. కొత్తగూడెం ఐటీఐలో సూపరింటెంటెండ్గా పనిచేసి గత మార్చి నెలలో రిటైర్డ్ అయ్యారు. నెలనెలా పెన్షన్ తప్ప ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ ఏమీ రాలేదు. గతంలో గుండె జబ్బురావడంతో స్టంట్ పడింది. రిటైర్డ్ అయ్యాక దాచుకున్న డబ్బులు చేతికి రాకపోవడంతో మనోవేదనతో మళ్లీ స్ట్రోక్ వచ్చింది. కొత్తగూడెం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లగా స్టంట్ పడుతుందని, రెండు లక్షలకుపైగా ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో అప్పు కోసం ప్రయత్నించినా ఎవరూ స్పందించలేదు. ఈయనకు రూ.30 లక్షలకు పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉంది. ఎట్టకేలకు బంధువుల వద్ద అప్పు తీసుకుని విజయవాడ ఆసుపత్రిలో స్టంట్ వేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.”
ఎన్నో ఆశలు పెట్టుకుని డబ్బులు దాచుకున్నాను. ఉద్యోగం దిగిపోయాక ప్రశాంతంగా బతకాలని అనుకున్నా.. కానీ, ఇన్ని సమస్యలు ఉంటాయనుకోలేదు. నాకంటే వెనుక దిగిపోయిన వారికి డబ్బులు వచ్చాయి. సిఫార్సు ఉంటేనే డబ్బులు ఇస్తారా..? నాలాంటి వారికి రిటైర్మెంట్ సొమ్ములు రావా? పెళ్లికి చేసిన అప్పులు ఉన్నాయి. ఇంటికి బకాయిలు ఉన్నాయి. అవన్నీ ఎలా తీర్చుకోవాలి. మానసిక ప్రశాంతత లేకుండాపోయింది.
– నరసింహారావు, రిటైర్డ్ ఏఎస్ఐ, భద్రాచలం
ఏడాదికేడాది దిగిపోయిన వారి సంఖ్య పెరుగుతున్నది. భర్త చనిపోయిన వాళ్లకు కూడా నేటికీ బెనిఫిట్స్ రాలేదు. చాలామంది ఆరోగ్యాలు దెబ్బతిని ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికీ చాలాసార్లు ధర్నాలు చేశాం. పెద్దఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దిగిపోయాక ఆసరా ఉంటుందని సొమ్ములు దాచుకుంటే వాటిని ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. ఉద్యోగ విరమణ చేసిన నెలరోజుల్లోనే సొమ్ములన్నీ చెల్లించాలి.
– బందు వెంకటేశ్వరరావు, ఆల్ పెన్షన్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు