మధిర(చింతకాని), జూన్ 25: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, అధికారం చేపట్టి 19 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతోందన్నారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు గురజాల హన్మంతరావు నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పిందని, తీరా గద్దెనెక్కిన తర్వాత మళ్లీ మోసపు మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టి ఏ ఒకరికి కూడా లబ్ధి చేకూర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు దీనిని ముడిపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఏం చేశారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు 45 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులకు ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసాను రెండు సీజన్లకు ఎగ్గొట్టిందని, ఒకసారి కేవలం మూడున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించి మిగతా రైతులను విస్మరించిందన్నారు.
విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యుడు మంకెన రమేశ్, మాజీ ఎంపీపీ మునుగోడు రత్నాకర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు వెంకటరామారావు, వంకాయలపాటి సత్యనారాయణ, గురజాల కృష్ణయ్య, పువ్వాల వెంకటేశ్వర్లు, ఎండపల్లి జనార్దన్రావు, తాతా ప్రసాద్, కొల్లి బాబురావు, సామినేని అప్పారావు, బొగ్గారపు రాంబాబు, రాచబంటి రమేశ్ పాల్గొన్నారు.