రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ బాగా నిర్లక్ష్యం చేస్తున్నది. రైతు భరోసా ఇవ్వకుండా.. అర్హులందరికీ రుణమాఫీ చేయకుండా అన్నదాతలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పంటలను సైతం సక్రమంగా కొనే పరిస్థితి లేకుండాపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తిచేయడం లేదు. ప్రణాళిక లక్ష్యం కొండంత ఉంటే.. కొనేది గోరంత ఉంటున్నది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా అనేక కొర్రీలు పెట్టి రైతులను ఏడిపిస్తున్నది. దీంతో రైతులు చేసేదేమీలేక దళారులకే పంటలను నిలువునా అమ్ముకుంటున్నారు. సర్కారు పెట్టే నిబంధనలు రైతుల్ని నిరుత్సాహానికి గురిచేస్తున్నది. కేవలం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు పెట్టే కొర్రీలతో కొనుగోళ్లు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
-భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 160 కొనుగోలు కేంద్రాల్లో జీసీసీ, సొసైటీ, ఐకేపీ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో సర్కారు ప్రతి ఏటా పౌరసరఫరాల శాఖకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. పంటల దిగుబడిని బట్టి ఈ ఏడాది 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అంచనా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ, సివిల్ సైప్లె అధికారులు మాత్రం ఇప్పటివరకు 27,850 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కొంతమంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించగా.. మరికొందరు దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు, తేమ శాతం, బాగా ఆరబెట్టాలని నిబంధనలు పెట్టడంతో రైతులు విసుగు చెంది దళారులకు అమ్ముకున్నారు. ఇదేకాక 48 గంటల్లో ఖాతాల్లో పడాల్సిన ధాన్యం సొమ్ములు రోజుల తరబడి పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
ఈ ఏడాది సన్నవడ్లు పండిస్తే పంట డబ్బులతోపాటు బోనస్ కూడా వెంటనే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది.. కానీ.. అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. పంటను విక్రయించిన వెంటనే బోనస్ ఇస్తానన్న అధికారులు ధాన్యం డబ్బులతోపాటు కాకుండా పదిరోజుల తర్వాత బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడికి అప్పులు చేసి సాగు చేసిన రైతులు రోజులతరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 30 లక్షల క్వింటాళ్ల సన్నబియ్యం వడ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 17.11 లక్షల క్వింటాళ్ల వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. ఇందుకు గాను రైతులకు రూ.8.6 కోట్ల డబ్బులు చెల్లించగా.. ఇంకా రూ.5.2 కోట్లు చెల్లించాల్సి ఉంది అన్నీ కొర్రీలే పెడుతున్నారు..
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే తేమ శాతం రాలేదని, వడ్లు ఆరలేదని నిబంధనలు పెట్టి రోజుల తరబడి కేంద్రం వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. అందువల్ల రైతులు చాలామంది దళారులకే విక్రయిస్తున్నారు. రేటు ఎంతవచ్చినా తొందరగా పని అయిపోతుందని, డబ్బులు వెంటనే వస్తాయని ధీమా ఉంది.
-రావులపల్లి పృథ్వీ, రైతు, నర్సాపురం, దుమ్ముగూడెం
ధాన్యం కొంటున్నారు.. కానీ.. డబ్బులు వెంటనే రావడం లేదు. బోనస్ కోసం వారాలు వారాలు తిరగాల్సి వస్తున్నది. పేరుకే కొనుగోలు కేంద్రాలు.. ఇబ్బందులు చాలా ఉన్నాయి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. ధాన్యం తీసుకెళ్లిన రోజే కొనేవాళ్లు, వెంటనే సొమ్ములు కూడా బ్యాంకు ఖాతాలో పడిపోయేవి.
-సూర వెంకటేశ్వరరావు, రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ
ధాన్యం అమ్మిన 48 గంటల్లో సొమ్ములు రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. ఎక్కడైనా తప్పులు పడితే బ్యాంకుల వద్ద ఆలస్యమవుతుందేమో కానీ మా ఆఫీసులో మాత్రం లేటు లేదు. ధాన్యానికి సొమ్ములు పడగానే బోనస్ డబ్బులు కూడా పడిపోతున్నాయి. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
-త్రినాథ్బాబు, డీఎం, సివిల్ సప్లయీస్, భద్రాద్రి కొత్తగూడెం