అశ్వాపురం, జూన్ 26 : కేసీఆర్ పాలనలో తాము చేసిన అభివృద్ధిని ఓర్వలేక ఆనాడు వేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు ధ్వంసం చేస్తున్నారని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తుమ్మలచెరువు పంచాయతీలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి లోతువాగు బ్రిడ్జిని గురువారం ఆయన పరిశీలించారు. తన హయాంలో వేసిన శిలాఫలకం ధ్వంసం చేసిన వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో తనతో పోటీపడలేని కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాల కూల్చివేతకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నియోజకవర్గ అభివృద్ధికి ఎవరి హయాంలో ఎన్ని నిధులు వచ్చాయనేది ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి గుణపాఠం చెబుతారన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, వెన్న అశోక్‌కుమార్, సూదిరెడ్డి గోపిరెడ్డి, మేడవరపు సుధీర్, చిలక వెంకటరామయ్య, మాజీ సర్పంచ్ బండ్ల సంధ్యారాణి, మాజీ ఎంపీటీసీ తాటి పూజిత, వీరారెడ్డి, గొర్రెముచ్చు వెంకటరమణ తదితరులు ఉన్నారు.