‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదనేది వాస్తవం. మరో రెండేళ్లు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ నాయక త్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకు అండగా ఉంటుంది. వేణు చికిత్స పొందుతున్న వైద్య శాల వద్ద కూడా శనివారం రాత్రి నుంచి రాక్షసపాలన సాగుతోంది. ప్రభుత్వం ఇక్కడ పోలీసులను పోలీసులను పెట్టింది. చికిత్స పొందుతున్న వేణు దగ్గర అతడి కుటుంబ సభ్యులను కూడా ఉండనివ్వడం లేదు. మమ్మల్ని కూడా వేణు దగ్గరకు వెళ్లనీయకుండా డోర్లు పెట్టి ఆపే ప్రయత్నం చేశారు. పోలీసులను, పికెట్లను పెట్టి ఆపినా ప్రజల్లో వచ్చే ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వేణుకు తక్షణమే మెరుగైన ఉచిత వైద్యం అందించాలి. అతడి ప్రాణాలను కాపాడాలి. నిరుపేద కుటుంబానికి చెందిన వేణు వెంటనే ప్రభుత్వం పకా ఇల్లు మంజూరు చేయాలి. వేణు కుటుంబానికి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.
-ఆసుపత్రి వద్ద మీడియాతో బీఆర్ఎస్ నేతలు
ఖమ్మం కమాన్‌బజార్, ఆగస్టు 2: జాబ్ క్యాలెండర్ పేరుతో హామీ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులను, ఉద్యోగార్థులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఉద్యోగాల పేరుతో వంచించడంతో, హామీలను ఎగవేయడంతో నిరుద్యోగులు తీవ్రమైన నిరాశలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్..
అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం, గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో మనస్తానం చెందిన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురానికి చెందిన గడ్డం వేణుకుమార్ శనివారం ఆత్మహత్యకు యత్నించిన విషయం విదితమే. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు తదితరులు ఆదివారం పరామర్శించారు. అధైర్య పడవద్దని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బాధితుడికి ధైర్యం చెప్పారు. అనంతరం, అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రి బయట వారు మీడియాతో మాట్లాడారు.
నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ముచేయడం దారుణమని మాజీ మంత్రి అజయ్‌కుమార్ విమర్శించారు. వేణుకుమార్ కూడా ప్రభుత్వ మోసాన్ని తాళలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మోసం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పెద్దలకు తెలియాలనే ఉద్దేశంతోనే సూసైడ్ నోట్ రాసి గ్రూప్స్ అభ్యర్థుల వాట్సప్ గ్రూపులో పోస్టు చేసి ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకే ఒక్క గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చిందని, హామీ ప్రకారం ఏటా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల తనలాంటి అభ్యర్థులు అవకాశాల్ని కోల్పోతున్నారని స్వయంగా వేణుకుమారే తన సూసైడ్ నోట్లో పేర్కొనడం విచారకరమని అన్నారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యల పరిషారం, వారి న్యాయమైన హకుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరఫున వేణుతోపాటు రాష్ట్ర యువతకు విజ్ఞప్తి చేస్తున్నామని, బీఆర్ఎస్ అందరికీ అండగా ఉంటుందని, తొందరపడి ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలతోపాటు నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడం వల్లనే గ్రూప్స్ ఉద్యోగార్థి వేణుకుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వం ఎలా కారణమైందో అతడి సూసైడ్ నోట్ చూస్తే అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మోసాలకు వేణు ఆత్మహత్యా ప్రయత్నమే ఉదాహరణ అని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం చేసిన మోసాన్ని, గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం అతడు చూసిన ఎదురుచూపులను వేణు తన సూసైడ్ నోట్‌గా రాసి తన ఆత్మహత్యాయత్నానికి ముందు గ్రూప్స్ అభ్యర్థుల వాట్సప్ గ్రూపులో పోస్టు చేశాడని గుర్తుచేశారు.
ఆ నోట్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి, సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేరేలా సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరడం తనతోపాటు ప్రజలందరినీ ఎంతో కలిచివేస్తోందని అన్నారు. ఆసుపత్రి బెడ్‌పై వేణు పరిస్థితి చూస్తుంటే కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి తల్లి మానసిక వికలాంగురాలని, అతడి తండ్రి గీత కార్మికుడని, అతడికి సొంత ఇల్లు కూడా లేదని, పదేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారని అన్నారు. అయినా, అతడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడానికి కొలమానం ఏమిటో చెప్పాలని జిల్లా నుంచి ప్రాతినిథ్య వహిస్తున్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు.
ంగ్రెస్ ప్రభుత్వ విధానాలే వేణుకుమార్ అత్మహత్యాయత్నానికి కారణమని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ, ఇంత వరకు జాబ్ క్యాలెండర్ అమలుచేయదని, గ్రూప్స్ సహా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. వేణు తన అవేదనతోపాటు, నిరుద్యోగుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసమే ఈ ప్రయత్నం చేశాడని అన్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం వేణు కుటుంబం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆరోపించారు.
వేణు ఆవేదన మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పోలీసు బందోబస్తుతో అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేణును పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు గుండాల కృష్ణ, ఉప్పల వెంకటరమణ, బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, వాచేపల్లి లక్ష్మీరెడ్డి, అజ్మీరా వీరూనాయక్, బత్తుల మురళి, షేక్ మక్బూల్, దండా జ్యోతిరెడ్డి, సామినేని హరిప్రసాద్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బంక మల్లయ్య, మహమ్మద్ రఫీ, మోరంపూడి ప్రసాద్, గొద్దేటి మాధవరావు, గడ్డం వెంకట్, పగడాల రవికుమార్, ఆరెంపుల వీరభద్రం, యడవల్లి భిక్షం, మాటేటి కిరణ్‌కుమార్, నాగార్జున, శంకర్ తదితరులు పాల్గొన్నారు.