ఖమ్మం, జనవరి 11 : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకుల విధానాలను, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ మంత్రులు దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాడుల విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉంటే కాంగ్రెస్ ఏడాది పాలనలో అశాంతి, అలజడి నెలకొందన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిచేసిన వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దాడులు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని తగిన రీతిలో బుద్ధి చెపుతామని హెచ్చరించారు.