పినపాక, అక్టోబర్ 4 : రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ఇచ్చిన హామీలను విస్మరించిన అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు సోడే సుధాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడూళ్ల బయ్యారం క్రాస్‌రోడ్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రేగా సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరాయి.
ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్‌రెడ్డి, పోలిశెట్టి సత్తిబాబు, గుమ్మడి గాంధీ, దాట్ల వాసుబాబు, రవివర్మ, బుల్లి బాబు, బెడద సురేందర్, రాయల బాబు, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, నాసర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.