ఖమ్మం, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (మామునూరు) తరువాత ఖమ్మం మార్కెట్టే అతి పెద్దది. ఖమ్మం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైతులేగాక పక్కనే ఉన్న ఆంధ్రాలోని పలు జిల్లాల రైతులు కూడా తమ పంటలను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కే తెచ్చి ఇక్కడే విక్రయిస్తుంటారు. అంతటి పేరున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలోనూ ఏమాత్రం తీసిపోకూడదనే ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించిన పువ్వాడ అజయ్ కుమార్ రూ.10 కోట్ల నిధులు తెచ్చారు. ఏళ్ల కాలంగా మిర్చి యార్డులో ఉన్న పాత షెడ్లను తొలగించి రూ.4 కోట్లతో కొత్త షెడ్లను, యార్డు మొత్తాన్ని సీసీతో నిర్మించారు.
నూతన డ్రైనేజీలను, మార్కెట్ చుట్టూ కొత్తగా కాంపౌండ్ వాల్‌ను కూడా నిర్మించారు. ఇది జరిగి సరిగ్గా ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. కానీ ఇప్పుడా షెడ్లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నేలమట్టం చేసింది. మోడల్ మార్కెట్ పేరుతో.. మిర్చి యార్డులో ఏడాదిన్నర క్రితమే రూ.4 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కట్టడాలను నిలువునా కూల్చివేసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల ఆనవాళ్లు లేకుండా చేయాలన్నట్లుగా వ్యవహరించింది. అయితే, ఏడాదిన్నర క్రితమే నిర్మించిన షెడ్లను కూల్చివేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ కూల్చివేతల సమయంలో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామంటూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రూ.155 కోట్లు మంజూరు చేసింది. అందుకు అనుగుణంగా మార్కెట్ షెడ్ల నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న షెడ్లన్నింటినీ నేలమట్టం చేసింది. ఇందులో భాగంగా ఏడాదిన్నర క్రితమే రూ.4 కోట్లతో చేపట్టిన నిర్మాణాలను తొలగించింది. ప్రస్తుతం జరిగే పనులతో ఇప్పటికే ఉన్న సీసీ రోడ్లతోపాటు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పనికిరాకుండా చేయనుంది. ఆ స్థానంలో డ్రైనేజీలను మళ్లీ కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నూతన సీసీ రోడ్లు, కొత్త షెడ్లు, నూతన అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. రూ.155 కోట్ల నిధులతో చేపట్టే పనుల బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ కూడా గత కేసీఆర్ సర్కారు నిర్మించిన కట్టడాలను తొలగిస్తూ నూతన పనులను మొదలు పెడుతోంది.
అయితే, ఏడాదిన్నర క్రితమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన షెడ్లను కూల్చివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ కోసమే అమాత్యుడు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోడల్ మార్కెట్ పేరుతో రూ.155 కోట్ల నిధులను తెచ్చి హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు పనులను అప్పగించడం.. ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రీ మోడలింగ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం నిర్మించిన షెడ్లను ఎందుకు కూల్చివేశారనేది నా స్థాయిలో నేను చెప్పలేను. మార్కెట్ మొత్తాన్ని కొత్తగా మోడలింగ్ చేసే క్రమంలో నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న నిర్మాణాలు కొత్తవే అయినప్పటికీ ప్రస్తుతం నిర్మించే ప్రదేశంలో ఆ షెడ్లు చూసేందుకు అందవిహీనంగా ఉంటాయనే ఉద్దేశంతోనే తొలగించారనేది నా అభిప్రాయం.
-పీ.ప్రవీణ్‌రెడ్డి, ఖమ్మం ఏఎంసీ కార్యదర్శి