ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు కుమ్ములాటలు, తిరుగుబాట్లు, తిట్ల పురాణాలకు దారితీసింది. కష్టాల్లోనూ ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని జెండా మోస్తే.. కార్యకర్తలకు అండగా నిలిస్తే.. టికెట్లు మరొకరికి కేటాయించడం సబబు కాదంటూ పార్టీ అగ్రనేతల తీరుపై మండిపడ్డారు. టికెట్ ఆశించి భంగపడిన నేతల అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని చెబుతూ.. తిట్ల దండకాన్ని లంకించుకున్నారు. బీసీలు, సీనియర్లను కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తమ అనుకూలురకే టికెట్లు ఇచ్చుకోవడంతో ఉమ్మడి జిల్లా పార్టీలో అసమ్మతి తారస్థాయికి చేరింది. సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో టికెట్ రాని నేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కొత్తగూడెం టికెట్ ఆశించి భంగపడిన ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అక్కడ సీపీఐకి కేటాయించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అశ్వారావుపేట టికెట్ తనకు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ మానవతారాయ్కు కేటాయించకపోతే కాంగ్రెస్ రెబల్‌గా పోటీకి నిలుపుతామని ఆయన అభిమానులు ప్రకటించారు. మాజీ మంత్రి సంభానికి సత్తుపల్లి టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వైరాలో అభ్యర్థి మాలోతు రాందాస్ నాయక్ పేరును ప్రకటించి ఆ తర్వాత నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అగాధంలో పడింది.
ఖమ్మం, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించకముందే బీఆర్ఎస్ అధిష్ఠానం ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. పొద్దు లేచిన దగ్గర్నుంచి ప్రజల మధ్యే ఉంటున్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం సీట్ల సర్దుబాటులో మల్లాగుల్లాలు పడుతూనే ఉన్నది. ఇప్పటివరకు రెండు దఫాలుగా విడుదల చేసిన జాబితాలో టికెట్ ఆశించి భంగపడిన వారి శాపనార్థాలు, ఏడుపులు పెడబొబ్బలు మరువకముందే సోమవారం విడుదలైన మూడో జాబితా మరికొందరి ఆశలను అడియాశలు చేసింది. దీనిలో భాగంగా మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘రెబల్స్’ భగ్గుమన్నారు. ‘హస్తం అధిష్ఠాన వైఖరిపై దుమ్మెత్తిపోశారు.
కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో విడత జాబితాలో వైరా నుంచి మాలోతు రాందాస్‌నాయక్‌కు చోటుదక్కింది. తెల్లవారేసరికి ఏం జరిగిందో తెలియదు గానీ ఆయన టికెట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తున్నది. మరోవైపు ఇతర ఆశావహులు ఇప్పటికీ సీటు కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా రాగమయికి అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్‌కూ చుక్కెదురైంది. దీంతో సంభాని వర్గీయులు గుర్రుమంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న మానవతారాయ్ కూడా తనకు సీటు ఇవ్వకపోవడంపై భగ్గుమంటున్నారు. మంగళవారం ఆయన అనుచరులు సత్తుపల్లి పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేశారు. మానవతారాయ్కి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయిస్తామని స్పష్టం చేశారు.
ఇల్లెందు టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ కోరం కనకయ్యకు కేటాయించడంతో అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలు చీమల వెంకటేశ్వర్లు రవికుమార్, నామోదర్నాయక్, గుగులోత్ రవి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. చివరికి ఏమవుతుందదో వేచి చూడాల్సిందే.
అశ్వారావుపేట టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ జారే ఆదినారాయణకు కేటాయించడంతో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత తాటి వెంకటేశ్వర్లు మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వెం టనే హైదరాబాద్‌కు బయల్దేరి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ చేరారు.
కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య, సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయి, పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట అభ్యర్థి జారె ఆదినారాయణ పార్టీలో చేరి పట్టుమని ఐదు నెలలైనా కాలేదని, వారికి సీట్లు కేటాయించి పార్టీ ఆదేశాలు పాటించి, పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వలేదనేది ఆశావహులు, సీనియర్ నేతల అసంతృప్తి. అలాగే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ వంటి సీనియర్ నేతను పక్కన పెట్టడం మరోకారణం. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద అత్యధికంగా ఉండే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పొత్తు ఒప్పందంలో భాగంగా కొత్తగూడెం టికెట్‌ను సీపీఐకి కేటాయించింది. సీపీఐ తరఫున అక్కడి నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. సోమవారం రాత్రి ఈ విషయం తేలడంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న ఎడవల్లి కృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ప్రెస్‌మీట్ పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఎడవల్లికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే టికెట్‌ను ఆశించి భంగపడి ఇదే బాటలో నాగా సీతారాములు, పోట్ల నాగేశ్వరరావు తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణను అమలు చేసే పనిలో ఉన్నారు. ఈ పరంపరలో కొత్తగా ఎడవల్లి చేరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పది శాసన సభాస్థానాల్లో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ, మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. కొత్తగూడెం సీటు జనరల్ కాగా బీఆర్ఎస్ కొత్తగూడెం సీటును బీసీ సామాజిక వర్గానికి చెందిన వనమా వెంకటేశ్వరరావుకు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఉదయ్‌పూర్ తీర్మానాన్ని తుంగలో తొక్కి కొత్తగూడెం జనరల్ సీటును పొత్తులో భాగంగా సీపీఐకి అప్పగించింది. ఆ పార్టీ ఓసీ అభ్యర్థికి టికెట్ కేటాయించింది. దీంతో రెండు పార్టీలకు చెందిన బీసీ నేతలు ఈ అంశాన్ని పరాభావంగా భావిస్తున్నారు.