ఖమ్మం రూరల్, మార్చి 29 : లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం పొన్నెకల్ పరిధిలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలను పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి సందర్శించిన ఆయన స్ట్రాంగ్‌రూంలు, రిసెప్షన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లవారీగా స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ రూం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్‌రూంకు కిటికీలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వేసవి దృష్ట్యా విద్యుత్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్లకు గదులు సిద్ధం చేయాలన్నారు. 25 అగ్నిమాపక పరికరాలు ఉన్నందున స్ట్రాంగ్ రూంలకు అలారం ఏర్పాటు చేయాలన్నారు. రిసెప్షన్ కేంద్రంలో రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఈవీఎం తరలింపు సిబ్బందికి సెగ్మెంట్లవారీగా కలర్ కోడ్‌తో కూడిన టీషర్టులు ఇవ్వాలన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శిక్షణకు సంబంధించి పీపీటీ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, ట్రైనీ ఐపీఎస్ పి.మౌనిక, ఆర్అండ్బీ ఎస్ఈ శ్యాంప్రసాద్, ట్రాన్స్‌కో ఎస్ఈ సురేందర్, ఎస్టీసీ రాజేశ్వరి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, అర్బన్ తహసీల్దార్ సీహెచ్.స్వామి తదితరులు పాల్గొన్నారు.