చండ్రుగొండ, ఫిబ్రవరి 9 : గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తిప్పనపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన కలెక్టర్.. తొలుత వైకుంఠధామాన్ని పరిశీలించి అక్కడ మొక్క నాటారు. వైకుంఠధామంలో భవనంపై స్లాబ్ లేకపోవడంతో అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. పారిశుధ్య పనుల బాధ్యత ప్రత్యేకాధికారులదేనని స్పష్టం చేశారు. అనంతరం చండ్రుగొండ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. గైర్హాజరు విద్యార్థుల గురించి హెచ్ఎం కృష్ణకుమారిని అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు ఇవ్వొద్దన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు లేవనే తదితర సమస్యలను జడ్పీటీసీ వెంకటరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డీపీవో లక్ష్మీరమాకాంత్, మండల ప్రత్యేకాధికారి సంజీవరావు, ఎంపీడీవో రేవతి, తహసీల్దార్ సాజియాసుల్తాన, ఎంపీపీ బానోత్ పార్వతి, జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు దారా వెంకటేశ్వరరావు, లంకా విజయలక్ష్మి, ఏఈలు శ్రీనివాస్‌రావు, లకన్నాయక్, ఎంపీవో తులసీరాం, ఏపీఎం సంతోశ్ ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం), వీవీ ప్యాట్ల మొదటిస్థాయి పరిశీలనను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 1600 కంట్రోల్ యూనిట్లు, 2800 వీవీ ప్యాట్లు, 1500 బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని తెలిపారు. నేటివరకు 790 యూనిట్ల ప్రాథమిక పరిశీలన పూర్తి అయ్యిందని, ఈ నెల 14వ తేదీ వరకు అన్ని యూనిట్ల పరిశీలన పూర్తవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈవీఎంల మొదటివిడత పరిశీలన చాలా ముఖ్యమైనదని, ఈ ప్రక్రియ మొత్తం గట్టి భద్రత, సీసీ టీవీల పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలిపారు. ఈసీఐఎల్‌కు చెందిన సాంకేతిక నిపుణుల బృందం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో శిరీష, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్, నాయబ్ తహసీల్దార్ రంగా ప్రసాద్, సిబ్బంది నవీన్, అశోక్ పాల్గొన్నారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 9 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లో గల అదనపు ఈవీఎంలను వినియోగించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం పార్టీల ప్రతినిధుల సమక్షంలో జడ్పీ ప్రాంగణంలోని గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంలను నూతన కలెక్టరేట్ ఆవరణలో ఫస్ట్ లెవల్ చెకప్‌కు తరలించారు. జిల్లా పరిషత్ ఈవీఎం గోడౌన్లో 810 బ్యాలెట్ యూనిట్లు, 716 కంట్రోల్ యూనిట్లు, 807 వీవీ ప్యాట్లను ఈ సందర్భంగా నూతన గోడౌన్‌కు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్‌నాయక్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.శ్రీనివాస్, జీఎస్ఆర్ఏ.విద్యాసాగర్, జి.పున్నయ్య, ఏ.గోపాలరావు, కె.కరుణాకర్, అధికారులు పాల్గొన్నారు.