కామేపల్లి, మే 21 : భూగర్భ జలాలు పుష్కలంగా ఉండడం.. పంట ఉత్పత్తుల ధరలు పెరగడంతో భూమి యజమానులు కూడా కౌలు రేట్లు పెంచుతున్నారు. కొంత భూమి ఉన్న రైతులు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేసినా.. ఇప్పుడు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్ల క్రితం క్వింటా పత్తి ధర రూ.2వేల నుంచి రూ.3వేలు ఉండేది. ప్రసుత్తం రూ.7వేలకు పైగా చేరింది. మిర్చి రూ.5వేల నుంచి రూ.8వేలు ఉండగా.. ప్రసుత్తం రూ.20వేలకు పైగా చేరింది. ఆపరాల ధరలు కూడా రూ.6వేలకు పైగా ఉండడం.. ఇలా అన్ని రకాల పంటలకు ధరలు పెరగడంతో కౌలు కూడా పెరుగుతూ వస్తోంది. గతంలో రూ.5వేల నుంచి రూ.10వేల మధ్య ఉండే కౌలు.. ఇప్పుడు రూ.20వేల నుంచి రూ.40వేలకు చేరింది. గతంలో వర్షాధారం మీదనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేసేవారు. ప్రసుత్తం మిషన్ కాకతీయతో మండలంలోని చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. దీంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో అధికంగా మిర్చి సాగు చేస్తున్నారు.
ఎకరాకు రూ.20వేల పైమాటే..
మండల వ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా రైతులు ఉండగా, వీరిలో దాదాపు 4 వేల మంది వరకు కౌలు రైతులున్నారు. కౌలు రైతులు మిర్చి పంట సాగుపై దృష్టి సారించడంతో సొంత భూమి ఉన్న రైతులు కౌలు ధరలు పెంచుతూ పోతున్నారు. ఐదేళ్ల క్రితం ఎకరం భూమికి కౌలు ధర రూ.5వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.20వేల నుంచి రూ.40వేలకు చేరింది. దీంతో సన్న, చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చికి మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో ఈ మొత్తం కూడా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది మిర్చి, పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రావడం.. మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండడంతో మళ్లీ కౌలు భూముల కోసం రైతులు పోటీపడ్డారు. దీంతో భూ యజమానులు కౌలు రేట్లు పెంచారు. అయినప్పటికీ కౌలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించి ఒప్పందం కుదుర్చుకున్నారు.
4వేలకుపైగా కౌలు రైతులు
మండలంలో సుమారు 4 వేలకు పైగా కౌలు రైతులున్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేయడంతో సాగుకు ఢోకా లేకుండా పోయింది. దీంతో వ్యవసాయాన్ని కౌలు రైతులు ఇష్టంగా చేస్తున్నారు. కౌలు ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే కౌలు మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తున్నారు. ఇప్పటికే కౌలు రైతులు సాగు పనులు మొదలుపెట్టారు.
7,500 ఎకరాల్లో మిర్చి సాగు
మండల వ్యాప్తంగా ఈ ఏడాది 7,500 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. ముఖ్యంగా మిర్చి పంటకు నీరు పుష్కలంగా ఉండాలి, పెట్టుబడి కూడా ఎక్కువగా అవసరం. ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు అందుబాటులో ఉండడం, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం రైతులకు కలిసొచ్చింది. దీంతో మిర్చి పంటపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 7,500 ఎకరాల్లో మిర్చి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో మిర్చి ధర బాగుండడంతో మరో 3వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దుక్కులు దున్నడంతోపాటు విత్తనాలను ఎంపిక చేసి ఆర్డర్ చేస్తున్నారు.