ఖమ్మం :అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఐసీడీఎస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ అందజేసిన స్మార్ట్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు అందజేశారు. అనంతరం కార్ ఇండియా, సేవ్ ఇండియా స్వచ్చంద సంస్థలు కోవిడ్ బాధిత పిల్లలకు అందిస్తున్న నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ ఆన్లైన్ ద్వారానే జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీచర్లకు, పర్యవేక్షకులకు స్మార్ట్ ఫోన్లను అందించడం జరుగుతుందన్నారు. కేంద్రాలకు వచ్చే లబ్దిదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
ముఖ్యంగా పోషణ లోపం కలిగిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక అహారం ఇవ్వడంతో పాటు, తల్లిదండ్రులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సీహెచ్ సంధ్యారాణీ మాట్లాడుతూ జిల్లా ఐసీడీఎస్ పరిధిలో ఉన్న1896 మంది అంగన్వాడీ టీచర్లు, మరో 76 మంది సూఫర్ వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందించడం జరుగుతుందన్నారు. నిత్యం కేంద్రాలలో జరిగే ప్రక్రియ లబ్దిదారుల హాజరు, ఆరోగ్యలక్ష్మీ పథకం అమలు, గర్బిణీ, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలు ఇక నుంచి ఆన్లైన్లోనే నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఆన్లైన్ విధానంపై అవగాహన కల్పించేందుకు కొద్ది రోజుల్లో టీచర్లు, పర్యవేక్షకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొవిడ్‌తో మరణించిన పిల్లల కోసం ప్రత్యేక నిత్యవసరాలను అందజేసి కారా ఇండియా, సేవ్ ఇండియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మధుసుదన్, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్‌సురభి, పోషన్ అభియాన్ ప్రాజెక్టు జిల్లా కోఆర్డినేటర్ హిమబిందు, డీసీపీఓ టీ విష్ణువందనతో పాటు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.