మామిళ్లగూడెం, జూన్ 29: టీఎస్పీఎస్సీ చేపట్టిన గ్రూప్-4 పరీక్షలను జిల్లా వ్యాప్తంగా 163 కేంద్రాల్లో శనివారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటల నుంచి 9:45 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:15 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని చెప్పారు. నిర్దిష్ట సమయం దాటిన తరువాత తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్ వ్యాలిడిటి ఫొటో గుర్తింపు కార్డు తీసుకొని రావాలని సూచించారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం చెక్ చేసుకోవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో సరిగా లేనిపక్షంలో గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని రావాలని సూచించారు. జిల్లాలో 163 పరీక్షా కేంద్రాలలో 49,781 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై సూచనలను క్షుణ్ణంగా చదవాలని, బబ్లింగ్‌లో ఎలాంటి పొరపాట్లూ చేయకూడదని, హాల్‌టికెట్ నెంబర్‌ను, ప్రశ్నపత్రం నెంబర్‌ను సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. పరీక్ష ముగిసి అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌ను అప్పజెప్పిన తర్వాత ఎడమచేతి బొటన వేలు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలని సూచించారు.
ఏర్పాట్లు పరిశీలించిన కేఎంసీ కమిషనర్
గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్న కేంద్రాల్లోని ఏర్పాట్లను కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి శుక్రవారం పరిశీలించారు. కేంద్రాల ఇన్చార్జులతో మాట్లాడుతూ.. ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలు పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.