భద్రాద్రి కొత్తగూడెం, మే 12 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో సోమవారం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు కలెక్టర్ ప్రియాంక అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,105 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో మెటీరియల్ పంపిణీ కేంద్రాల నుంచి పోలీస్ బందోబస్తు నడుమ సిబ్బంది, ఈవీఎంలను తరలించారు. కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోకి రావడంతో సిబ్బంది అంతా ఖమ్మం పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. భద్రాచలం, ఇల్లెందు, పినపాక పరిధిలో ఉద్యోగులు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
ఉదయం ఐదు గంటలకు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. రెండు గంటలకొకసారి పోలింగ్ శాతాన్ని తెలియజేయడం కోసం మీడియా కేంద్రాన్ని కలెక్టరేట్లో అందుబాటులో ఉంచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అవడం వల్ల పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మావోయిస్టుల ప్రభావిత జిల్లా కావడంతో సాయంత్రం 4 గంటలకే వరకూ పోలింగ్ ఉంటుందని ఎస్సీ రోహిత్‌రాజు తెలిపారు. అదీగాక ఓటర్లను తప్ప ఇతరులనెవరినీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు.