మామిళ్లగూడెం, ఆగస్టు 30: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణ హితానికి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆకాంక్షించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పీవోపీ విగ్రహాల వల్ల ఎన్నో అనర్థాలున్నాయనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
వినాయక చవితి ఉత్సవాలు, గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవ కమిటీ బాధ్యులు అన్ని శాఖల సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. మండపాల వద్ద పారిశుధ్యం, విద్యుత్ ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జన ప్రదేశాల్లో పూర్తిస్థాయి బారికేడ్లు, తాగునీరు, లైటింగ్, మొబైల్ టాయిలెట్లు, సహాయ కేంద్రాలు, వైద్య శిబిరాలు వంటివి ఏర్పాటుచేయాలని సూచించారు. నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మండపాల్లో విగ్రహ ప్రతిష్ఠ సమయంలో పోలీసుల సహకారం ఉంటుందన్నారు. ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్, ప్రసాదరావు, రాజేశ్వరి, గణేశ్, రాజేందర్, ఉత్సవ కమిటీల బాధ్యులు పాల్గొన్నారు.