ఖమ్మం, ఏప్రిల్ 9: ప్రేమానురాగాలకు ప్రతీకైన ఆడపిల్ల పుట్టడం గొప్పవరమని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకు భగవంతుడిచ్చిన ఆత్మీయ కానుక ఆ పండంటి పాపాయేనని అన్నారు. ఖమ్మం సారథినగర్కు చెందిన మౌనిక సురేశ్ దంపతులకు మార్చి 1న ఆడపిల్ల జన్మించిన నేపథ్యంలో ‘మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా మౌనిక – సురేశ్ దంపతుల ఇంటికి బుధవారం కలెక్టర్ వెళ్లారు. వారి కుటుంబానికి స్వీట్ బాక్స్, పండ్లు, దుస్తులు, బర్త్ సర్టిఫికెట్ అందించారు. దంపతుల తల్లిదండ్రులు, అత్తమామలను శాలువాలతో సతరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించకుండా అదృష్టంగా భావించాలని సూచించారు. అమ్మాయి ఆశించిన మేరకు చదువుకోనివ్వాలని సూచించారు. తర్వాత ఉద్యోగంలోగానీ, వ్యాపారంలోగానీ స్థిరపడి సొంత ఆదాయ వనరులు సంపాదించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆ తర్వాత మాత్రమే వివాహం గురించి ఆలోచించాలని అన్నారు. ఆడపిల్లల భావాలకు గౌరవించాలన్నారు. ఇంట్లో అమ్మాయిలుంటే ఇల్లు కళకళలాడుతుందని అన్నారు. మౌనిక – సురేశ్ దంపతుల కోరిక మేరకు పెద్ద పాప రితికతో కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి సన్నబియ్యం అందిన వివరాలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. డీడబ్ల్యూవో కే.రాంగోపాల్రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, సీడీపీవో వీరభద్రమ్మ పాల్గొన్నారు.