ఖమ్మం ఎడ్యుకేషన్/ మామిళ్లగూడెం, నవంబర్ 27: పదో తరగతి వార్షిక పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, పదో తరగతి పరీక్షలపై కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి హెచ్ఎంలు, ఎంఈవోలతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
విద్యార్థుల జీవితంలో పదో తరగతి చాలా కీలకమని అన్నారు. ఇక్కడ ఫెయిల్ అయితే చదువు నిలిపివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా పని చేయాలని ఆదేశించారు. ఇప్పటి నుంచే పిల్లలను ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆ సమయంలో పౌష్టికాహారం అందించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
6 నుంచి 8 తరగతుల వరకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ మాట్లాడుతూ సబ్జెక్ట్ టీచర్ సెలవులో ఉంటే డిప్యూటేషన్‌పై మరో టీచర్‌ను కేటాయించాలన్నారు. అభ్యాస దీపికలతోపాటు విద్యార్థులకు మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నాలెడ్జ్ బుక్లెట్ తయారు చేస్తున్నామని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. డీఈవో ఎస్ఎస్ శర్మ, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.