రఘునాథపాలెం, మార్చి 12 : చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థులకు సూచించారు. బుధవారం ఖమ్మం నగరం పాండురంగాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సదుపాయాలు, విద్యాబోధన, రోజువారీ దినచర్య, స్కూల్ పరిసరాలను పరిశీలించారు.
అనంతరం ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పలు అంశాలపై విద్యాబోధన చేశారు. జువాలజీ పాఠ్యాంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు. 10వ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిశ్యత్తు, లక్ష్యాలను సాధించేందుకు మార్గదర్శకంగా ఉంటాయని సూచించారు. పరీక్షలకు 10రోజులూ ఉన్నందున సమయాన్ని వృథా చేయరాదన్నారు. జిల్లాలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈవో సోమశేఖరశర్మ, పాఠశాల హెచ్ఎం పోరిక ప్రేమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.