ఖమ్మం, ఫిబ్రవరి 28: మహిళల జీవితాల్లో మార్పు దిశగా ఖమ్మం జిల్లాలో అడుగులు పడ్డాయని, భవిష్యత్తులో మహిళా అభివృద్ధికి మరింత మెరుగ్గా పని చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మహిళా సమాఖ్య సభ్యులకు సూచించారు. స్థానిక టేకులపల్లిలో శుక్రవారం నిర్వహించిన గౌతమి జిల్లా మహిళా సమాఖ్య సాధారణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్లు, మహిళ డెయిరీ, మహిళా మార్టు ఏర్పాటు ద్వారా జిల్లాలో మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ కోసం నిర్దేశించిన సమయంలో వైద్యులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎవరైనా ఆడపిల్ల అని అబార్షన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వైద్యుల దృష్టికి వస్తే వెంటనే తమకు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఆడపిల్ల.. ఇంటికి, సమాజానికి, జాతికి విలువైన ఆణిముత్యమని, ఆడపిల్లల సంఖ్య పెంచాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు.
మహిళా సమాఖ్యలో ఉన్న సభ్యుల్లో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల పుడితే తనను పిలవాలని, సంతోషంతో వచ్చి ఆ చిన్నారిని ఆశీర్వదిస్తానని పేర్కొన్నారు. డీసీపీవో విష్ణువందన, డీఎంసీ డీహెచ్ఈడబ్ల్యూ సమ్రీన్లు ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమం కింద చేపట్టే పనులను వివరించారు. సీజన్ వ్యాధుల పట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ ‘బేటీ బచావో – బేటీ పడావో’ పోస్టర్లను ఆవిషరించారు. డీఆర్డీవో సన్యాసయ్య, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, సంబంధిత శాఖల అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.