ఖమ్మం, నవంబర్ 9 : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం నగరంలోని సారథి నగర్లో ఎన్యూమరేటర్లు, అధికారులతో కలిసి కలెక్టర్ ఇంటింటికీ తిరుగుతూ సర్వే ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
సర్వేలో ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వేపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పథకాలు రద్దు చేయరనే విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. సర్వేలో ప్రతి కుటుంబం పాల్గొనాలని, ఏ ఒక ఇంటిని వదలకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పై అధికారులకు ఎన్యూమరేటర్లు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి, సం బంధిత అధికారులు పాల్గొన్నారు.