మామిళ్లగూడెం, అక్టోబర్ 7 : ప్రజావాణిలో బాధితుల నుంచి స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్టలతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చింతకాని మండలం అనంతసాగర్‌కు చెందిన శీలం లక్ష్మి తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, దళితబంధు యూనిట్ కింద తనకు గొర్రెలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా.. చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారిని ఆదేశించారు.
రఘునాథపాలెం మండలం వీవీపాలేనికి చెందిన కొల్లి ఉపేంద్రయ్య తనకు ఎస్సీ స్వశక్తి యూనిట్ సబ్సిడీ సాయం రాలేదని, వాటిని ఇప్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టర్ వేతనాలు చెల్లింపునకు చర్యలు చేపట్టాలని డీపీవోను ఆదేశించారు.
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన డి.ఉపేందర్.. సాగర్ పంట కాల్వ అప్రోచ్ కెనాల్ ద్వారా రైతుల పొలాలకు నీరందించే కాల్వను ఇష్టం వచ్చినట్లు కబ్జా చేశారని, దీనిని పునరుద్ధరించి సాగు నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరగా.. వెంటనే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. అనంతరం జిల్లా కోశాధికారిగా పనిచేసి ఇటీవల మహబూబాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన సత్యనారాయణను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షారైనా, డీఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.