మామిళ్లగూడెం, ఏప్రిల్ 7 : ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన చీకటి శ్రీను తన భూమి, బావి సీతారామ ప్రాజెక్టు పాలేరు లింక్ కెనాల్ కింద పోయాయని, బావికి సంబంధించిన పరిహార సొమ్ము జమకాలేదని, వాటిని ఇప్పించాలని కోరారు.
చింతకాని మండలం కొదుమూరుకు చెందిన తాళ్లూరి వెంగళరావు తమ భూములకు అవసరమైన సర్వీస్ రోడ్డును నిర్మించాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందన్నారు. ప్రజావాణి ద్వారా వివిధ శాఖలకు 300లకు పైగా దరఖాస్తులు పంపిస్తే 151 అర్జీలకు మాత్రమే స్పందన వచ్చిందని సీపీవో, డీఆర్డీవో, మున్సిపల్, రెవెన్యూ, పంచాయితీరాజ్శాఖల వద్ద పెండింగ్లో ఉన్నవాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ పాల్గొన్నారు.