ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 28 : పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిపై మానవుల కారణంగా అనేక రకాల జాతులు అంతరించిపోతున్నాయని అన్నారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ లాంగ్వేజ్ కోర్సులు శిక్షణ అందించేందుకు అదనపు కంప్యూటర్, ప్రాజెక్టర్, ఆడిటోరియంలో చైర్, ఆడియో సిస్టమ్ మొదలగు సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
హాస్టల్లో భోజనం, వసతి బాగా లేదని ఎస్సీ హాస్టల్ విద్యార్థినులు తెలుపగా, వాటిని పరిష్కరిస్తామన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే విద్యార్థినులకు అందించాలన్నారు. తెలుగు సాహిత్యవేత్త గుర్రం జాషువా జయంతి సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వేడుకలో కలెక్టర్ పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాల ఆడిటోరియంను పరిశీలించి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ప్రిన్సిపాల్‌కు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
యువత జీవితంలో ఎదురయ్యే వైఫల్యాల పట్ల భయాన్ని వదిలి ముందుకుసాగాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో పాల్గొన్నారు. 18 కంపెనీలు, 1,500 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి కలెక్టర్ ఆఫర్ లెటర్లను అందించారు. యువత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా కృషి చేయాలన్నారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రీజినల్ ఉపాధి అధికారి రవీందర్, జిల్లా ఉపాధి అధికారి మాధవి తదితరులు పాల్గొన్నారు.