మామిళ్లగూడెం, మార్చి 10 : ప్రజలు తమ సమస్యలపై చేసుకున్న వినతులను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల ప్రజావాణికి వచ్చి దరఖాస్తులు సమర్పిస్తున్నందున వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని సూచించారు. కాగా.. సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన బేతిని అప్పారావు, రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, సింగరేణి మండలానికి చెందిన సయ్యద్ చాంద్ పాషా తదితరులు తమ తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ అధికారులు తదితరులుపాల్గొన్నారు.