ఖమ్మం, ఫిబ్రవరి 21: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ప్రతి దశలో తోడ్పాటు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణ పథకంపై ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల మండల, గ్రామ పంచాయతీస్థాయి అధికారులతోపాటు మండల ప్రత్యేక అధికారులకు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులకు మాత్రమే ఇల్లు అందేలా చూడాలని, వీటి నిర్మాణంపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి దరఖాస్తును ఎవరు పరిశీలన చేస్తున్నారు అనే వివరాలు పకాగా రికార్డు ఉంటుందని, అనర్హులకు ఇండ్లు మంజూరైనట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విడతల వారీగా ప్రతిఒకరికి ఇల్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అత్యంత పేదలు, ఇండ్లు లేనివారు, సొంత స్థలం ఉన్నవారికి మొదటి విడతలో ఇళ్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి ప్రతి దశ నిర్మాణంలో సామగ్రి ధరలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎంపికచేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు గ్రౌండ్ చేయాలని, రెండువారాల్లో ఇంటి బేస్మెంట్ పనులు పూర్తయ్యేలా చూడాలని, బేస్మెంట్ పూర్తయితే లక్ష రూపాయలు విడుదల అవుతాయన్నారు. ప్రతి సోమవారం పంచాయతీ కార్యదర్శులు మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్హౌస్ను పరిశీలించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈవో దీక్షారైనా, డీపీవో ఆశాలత, హౌజింగ్ పీడీ శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.