రఘునాథపాలెం, మే 15: ఆయిల్‌పాం సాగు లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా చేరుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పాం సాగు, వ్యవసాయ శాఖల పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గడిచిన 8 నెలల కాలంలో ఖమ్మం జిల్లాలో ఆయిల్‌పాం సాగు విస్తరణను దాదాపు రెండింతలు చేసుకోగలిగామని, ఇందుకు కృషిచేసిన అధికారులందరూ అభింనందనీయులని అన్నా రు.
ఆయిల్‌పాం సాగుకు అనుకూలంగా డీడీలు తీసిన రైతులు వచ్చే వానకాలం ఇతర పంటలు వేయకుండా జగ్రత్త వహించాలని సూచించారు. డీడీలు తీసిన రైతుల పొలాల్లో వానకాలం నుంచి ఆయిల్‌పాం మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ, హార్టికల్చర్ అధికారులు పొలాల దగ్గరకు వెళ్లి ఆయిల్‌పాం సాగుచేస్తున్న రైతులతో మాట్లాడాలన్నారు.
ఏఈవోలు తన క్లస్టర్ పరిధిలో కనీసం 10 ఎకరాల్లో అయినా ఆయిల్‌పాం విస్తరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పంటల కొనుగోలు కేంద్రాల వద్ద ఆయిల్‌పాం ఫ్లెక్సీలు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటుచేసి ఆయిల్‌పాం సాగు లాభాలను వివరించాలని సూచించారు. వరి, మక్క, పత్తి, మిర్చి పంటల సాగు వల్ల వచ్చే ఆదాయానికి, ఆయిల్‌పాం పంట వల్ల వచ్చే ఆదాయానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ కరపత్రాలు ముద్రించాలని సూచించారు. అలాగే, నకిలీ విత్తనాలు విక్రయించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయిల్‌పాం సాగుపై ఉద్యానశాఖ ముద్రించిన బ్రోచర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయా శాఖల అధికారులు ఎంవీ మధుసూదన్, పుల్లయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.