ఖమ్మం సిటీ, సెప్టెంబర్ 25 : పెద్దాసుపత్రిలో అవసరమైన పరికరాలు, సౌకర్యాలకు సంబంధించి ప్రతిపాదనలు త్వరగా రూపొందించి తనకు సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. బుధవారం ఆయన నగరంలోని పెద్దాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాజువాలిటీ, ఏఎంసీ, జనరల్ వార్డులు, వెయిటింగ్ హాల్, ఐసీయూ, ఫార్మసీ, మెడికల్ రూంలు, ఓపీ, ఫిజియోథెరపీ గదులను పరిశీలించారు.
అక్కడి రోగులు, సహాయకులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. మందులు, ఇతర రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఆర్వోబీ నూతన ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు.
వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్య నిర్వహణ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. హెచ్‌డీఎస్ కమిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఖాన్ ఆదేశించారు. కార్యక్రమంలో ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ కళావతిభాయి, డిఫ్యూటీ సీఎస్ ఆర్ఎంవో డాక్టర్ రాంబాబు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.