కూసుమంచి, నవంబర్ 18: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా ధాన్యం బోనస్ డబ్బులు క్వింటాకు రూ.500 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. పాలేరులో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంత ధాన్యం వచ్చింది? ఎంత కొనుగోలు చేశారు? కొనుగోలు చేసిన తర్వాత ఎక్కడికి పంపించారు? గన్నీ బ్యాగులు ఉన్నాయా? అని ఆరా తీశారు. చిరిగిన బ్యాగుల్లో ధాన్యం నింపొద్దని, అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ కేంద్రంలో టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని, లేదంటే త్వరగా తెప్పించుకోవాలని సూచించారు.
ధాన్యం తెచ్చిన రైతులతో మాట్లాడుతూ.. ఎన్ని రోజుల క్రితం వచ్చారు? తేమ శాతం ఎంత ఉంది? కొనుగోలు చేశారా? లేకుంటే ఎందుకు ఆలస్యమైంది? అని అడిగి తెలుసుకున్నారు. దీంతో పలువురు రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని కలెక్టర్‌కు చెప్పగా.. దీని గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దళారులకు ధాన్యం అమ్మకుండా ఐకేపీ కేంద్రాల్లో విక్రయించి రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సన్న రకాల కొనుగోలు రిజిస్టర్‌ను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, ఆలస్యం చేస్తే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐకేపీ ఇన్చార్జి కొత్తా జ్యోతి, ఏవో రామడుగు వాణి, ఏపీఎం సత్యవర్ధన్ రాజు తదితరులు ఉన్నారు.