తిరుమలాయపాలెం, ఆగస్టు 19 : అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, విధి నిర్వహణలో ఎవరు అశ్రద్ధ కనబరిచినా చర్యలు తప్పవని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలస్యంగా వచ్చిన ఎంపీడీవో శిలార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన పంచాయతీ కార్యదర్శి సునీతపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు.
మండలంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, విషజ్వరాల వ్యాప్తి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తిరుమలాయపాలెం 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. వైద్య సేవల తీరుపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ కృపా ఉషశ్రీ కలెక్టర్కు వివరించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.