ఖమ్మం, అక్టోబర్ 3: వానకాలం ధాన్యం కొనేందుకు జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని అన్నారు. క్షేత్రస్థాయిలో అవసరాలను పరిశీలించి మరిన్ని కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు – డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన – అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియ’ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడారు.
ప్రతీ కొనుగోలు కేంద్రం పరిధిలోని గ్రామాల్లో సాగైన పంటలు, దిగుబడి వచ్చే ధాన్యం వివరాలను వ్యవసాయ శాఖ నుంచి తీసుకుంటామని, తదునుగుణంగా కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తామని వివరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వనరులను వారం రోజుల్లో సిద్ధం చేయాలని సూచించారు. సన్న రకం ధాన్యం వివరాలను ధ్రువీకరించాలని అన్నారు.
అవసరమైన మేర టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టులను అప్రమత్తం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో దాన్యం కొనుగోలు సమస్యలను తెలిపేందుకు జిల్లాలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే 1077 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, మధుసూదన్‌నాయక్, ఏడీసీపీ ప్రసాదరావు, డీఆర్డీవో సన్యాసయ్య, డీఈవో సోమశేఖరశర్మ, ఇతర అధికారులు చందన్‌కుమార్, శ్రీలత, పుల్లయ్య, వెంకటరమణ, అలీం పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని భద్రాద్రి కలెక్టర జితేశ్ వి పాటిల్.. జిల్లా అధికారులను ఆదేశించారు. వానకాలం ధాన్యం కొనుగోలు అంశంపై హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాచలం ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ జితేశ్, ఐడీవోసీ నుంచి అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై పత్రికల్లో కథనాలు వస్తే స్పందించాలని, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, ఇతర అధికారులు త్రినాథ్, బాబురావు, నరేందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.