ఖమ్మం ఎడ్యుకేషన్, అక్టోబర్ 18: చదువుల్లో ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి.. వారిని మెరికల్లా తీర్చిదిద్దేది ఒక్క ఉపాధ్యాయుడేనని, వారు విధులు సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే మరింత మంది విద్యార్థులు ప్రయోజకులవుతారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులతో శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖాముఖిలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలతో సమానమని, మన తల్లిదండ్రులు కూడా అవే పాఠశాలల్లో చదివి గొప్ప స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్సీ కోసం ఎంతో కష్టపడి చదివి ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారని, ఇది మీకు మొదటి అడుగు మాత్రమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఎక్కువగా చదువుతారని, వీరిలో కసి పెంచి జీవితంలో ఉన్నత స్థాయికి చేరేలా చూడాలన్నారు. అమెరికా, కెనడా వంటి దేశాలు సైతం వైఫల్యం పొందిన చంద్రయాన్ ప్రాజెక్టులను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారని, వారంతా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారన్నారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి పెట్టామన్నారు. నా చిన్నతనంలో 7వ తరగతి వరకు బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌గా ఉన్నానని, అప్పుడు విజయలక్ష్మీ టీచర్ పెట్టిన శ్రద్ధతో నేడు కలెక్టర్‌గా ఉన్నానని తెలిపారు. జెడ్పీ సీఈవో దీక్షా రైనా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైనదని, వారి కారణంగానే మనమంతా ఈ స్థాయిలో ఉన్నామని గుర్తు చేశారు. డీఈవో సోమశేఖర శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో 516 మందిని డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిందని, ఇందులో 481 మంది విధుల్లో చేరారన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు, ఆర్ఎంవో రాజశేఖర్, ఏఎంవో రవి, హెచ్ఎంలు, అధికారులు పాల్గొన్నారు.