మామిళ్లగూడెం, డిసెంబర్ 2 : ప్రజలు తమ సమస్యలపై సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లో చేయూత పింఛన్లు, సదరం సర్టిఫికెట్లకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదుల సహాయ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి పరిశీలించిన కలెక్టర్.. వాటిని రిజిస్టర్లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు.
గ్రీవెన్స్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బోనకల్ మండలానికి చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రతినిధులు, ఖమ్మం నగరంలోని వేణుగోపాల్ నగర్ చెందిన వెంకటనర్సమ్మ, తిరుమలాయపాలెం మండలం రమణతండాకు చెందిన సునీత తమ తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను ఆయా శాఖల ఉన్నతాధికారులు పరిష్కరించాలని ఆదేశిస్తూ కలెక్టర్ వారికి పంపించారు. కార్యక్రమంలో డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.