మామిళ్లగూడెం, అక్టోబర్ 7: ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామిపై కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పలు సర్టిఫికెట్ల జారీలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీనివల్ల తాము ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయామని, వచ్చిన ఉద్యోగాలు పొందేందుకూ అర్హత కోల్పోయామని సోమవారం నాటి గ్రీవెన్స్ వద్ద పలువురు ఉద్యోగార్థులు కలెక్టర్‌కు విన్నవించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. సదరు తహసీల్దార్‌ను ఐడీవోసీలోని గ్రీవెన్స్ వద్దకు పిలిపించారు. కొద్దిసేపటికి సదరు తహసీల్దార్ అక్కడికి రాగానే.. జిల్లా అధికారుల ముందే అతడికి చీవాట్లు పెట్టారు.
కొందరు ఉద్యోగార్థులు ఎన్నో ఏళ్లుగా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధిస్తే.. వారికి సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయకపోవడం వల్ల వారు ఆయా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని మందలించారు. ఇలాంటి నిర్లక్ష్యపు పనితీరు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇటీవలి వరదల్లో ధ్రువపత్రాలు కొట్టుకుపోయిన వారికి, డీఎస్సీ అభ్యర్థులకు, ఆరోగ్య శాఖ అభ్యర్థులకు సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో కూడా సదరు తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారంటూ పలువురు అభ్యర్థులు స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.