చింతకాని, జూన్ 20: ఈ వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులను ఆయా శాఖల అధికారులు సమర్థంగా ఎదుర్కోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత గురించి వారికి స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. చింతకాని మండలంలో గురువారం పర్యటించిన ఆయన.. వివిధ ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. తొలుత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్థల సేకరణ, రిజిస్ట్రేషన్ల వివరాలు, ధరణి పెండింగ్ సమస్యలు, రైతుల వినతులు తదితర వివరాల గురించి డిప్యూటీ తహసీల్దార్ వీరభద్రనాయక్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం చింతకాని పీహెచ్‌సీకి వెళ్లి అక్కడి రోగులను పలుకరించి వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. రోగులు పోషకాహారం తీసుకోవాలని, గర్భిణులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పీహెచ్సీ వైద్యులు రాబోయే మూడు నెలలపాటు నిత్యం పల్లెల్లో అందుబాటులో ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నేలపైనే కూర్చొని చిన్నారుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. మండల వైద్యాధికారి ఆల్తాఫ్, ఎంపీవో రవీంద్రప్రసాద్, డీటీ వీరభద్రనాయక్, గిర్దావర్ ఉష, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల క్రితం కలెక్టర్‌గా విధుల్లో చేరిన ముజమ్మిల్ ఖాన్.. గురువారం నాటి చింతకాని పర్యటనలో సామాన్యుడిలా వ్యవహరించారు. అటు అధికారులతోనూ, ఇటు ప్రజలతోనూ ఆయన మమేకమైన తీరు అతడి నిరాడంబరతకు అద్దం పట్టింది. కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌ను చూసి గౌరవపూర్వకంగా సిబ్బంది లేచినప్పటికీ వారిని వారించి వారి పక్కనే కూర్చొని విధుల గురించి వాకబు చేశారు. గెజిటెడ్ సంతకం కోసం పీహెచ్‌సీకి వచ్చిన ఓ మహిళను పలుకరించి సమస్యను అడిగి తెలుసుకొని స్వయంగా తానే సంతకం చేశారు.