ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 7: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో ఎంఈవోలు, హెచ్ఎంలతో టెన్త్ పరీక్షలు, విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యాసన స్థాయిల్లో నాణ్యతమైన పురోగతి సాధించాలన్నారు. ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్య అందుతుందన్న నమ్మకం తల్లిదండ్రులకు కల్పించాల్సిన బాధ్యత హెచ్‌ఎంలపై ఉందన్నారు. పిల్లలకు అర్థమయ్యేలా బోధన జరగాలని సూచించారు. బోధనలో టీచర్ల లోపాలను గమనించి అవసరమైన సలహాలు హెచ్ఎంలు ఇవ్వాలని, చివరి బెంచ్ విద్యార్థికి కూడా సబ్జెక్ట్‌పై ఆసక్తి కలిగించాలన్నారు.
టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులతోపాటు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యతో పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు మంచి పునాదులు వేయాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి ప్రోత్సహించాలని, ప్రతి ఒక్క టీచర్ పంచసూత్రాలైన ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కలెక్టర్ సమీక్షకు ముందు డీఈవో టెన్త్ స్పెషల్ టెస్ట్‌ల్లో పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రగతిని సమీక్షించారు. డీఈవో సోమశేఖరశర్మ, డీసీఈబీ సెక్రటరీ నారాయణ, ఏఎంవో రవికుమార్, యూడైస్ భానుప్రకాష్, సీఎంవో రాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.